Rahul Ramakrishna | గిరిజనుల స్వయంపాలన, హక్కుల పరిరక్షణ కోసం రూపొందించిన ‘పెసా’ (పంచాయతీలను షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరించే చట్టం-1996) అమలు ఎంతవరకు జరుగుతోందనే అంశంపై సినీ నటుడు రాహుల్ రామకృష్ణ ప్రశ్నలు సంధించారు. చట్టం అమలులో ప్రభుత్వాల పనితీరును తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ఆయన దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తుల ప్రతులతో పాటు అడిగిన ప్రశ్నలను ‘ఎక్స్’ వేదికగా పంచుకోవడంతో విషయం సామాజిక, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన 2014 జూన్ 2 నుంచి ఇప్పటివరకు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా పెసా అమలుకు తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలు ఇవ్వాలని రాహుల్ కోరారు. గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖల వద్ద ఉన్న సంబంధిత ఫైళ్లు, ఉత్తర్వులు, నివేదికలను అందజేయాలని దరఖాస్తుల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామసభల బలోపేతం కోసం తీసుకున్న చర్యలు, వాటిపై జరిగిన ఖర్చుల వివరాలను వెల్లడించాలని కోరారు. పెసా పరిధిలోని గ్రామాల్లో గ్రామసభల ఏర్పాటు, వాటి హద్దుల నిర్ధారణకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, సర్క్యులర్ల ప్రతులను అందించాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు. 2019 నుంచి 2026 వరకు జిల్లాల వారీగా ఎన్ని గ్రామసభలు నిర్వహించారో, వాటికి సంబంధించిన హాజరు వివరాలు, సమావేశాల నివేదికలను వెల్లడించాలని కోరారు. అలాగే, పెసా అమలులో ఉన్న లోపాలపై కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, గవర్నర్ కార్యాలయం నుంచి రాష్ట్రాలకు అందిన సూచనలు, లేఖల వివరాలను కూడా ఇవ్వాలని అడిగారు.
పెసా చట్టంపై అవగాహన కార్యక్రమాలు, శిక్షణ శిబిరాల నిర్వహణకు కేటాయించిన నిధులు ఎంత, వాటిలో ఎంత మొత్తాన్ని ఖర్చు చేశారన్న అంశంపై కూడా జిల్లా, సంవత్సరం వారీగా సమాచారం కోరడం విశేషం. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో మైనింగ్ ప్రాజెక్టులు, పరిశ్రమలు లేదా ఇతర అభివృద్ధి పనుల కోసం భూమి సేకరణ చేపట్టే ముందు గ్రామసభల ఆమోదం తప్పనిసరి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో జరిగిన భూసేకరణ ప్రతిపాదనలు, వాటికి గ్రామసభలు ఇచ్చిన అనుమతులు, ఆమోద తీర్మానాల కాపీలను అందించాలని రాహుల్ కోరారు. భూసేకరణ కారణంగా ప్రభావితమైన గిరిజన కుటుంబాల పునరావాసం విషయంలో చట్ట నిబంధనలను ఎంతవరకు పాటించారో తెలిపే రికార్డులను కూడా సమర్పించాలని దరఖాస్తులో పేర్కొన్నారు. అలాగే, గిరిజన భూవివాదాలు, పెండింగ్ కోర్టు కేసులు, అందిన ఫిర్యాదులు, వాటి పరిష్కార స్థితిగతులపై పూర్తి సమాచారాన్ని అందించాలని కోరారు. పెసా చట్టం అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన తాజా సమగ్ర నివేదికల డిజిటల్ కాపీలను కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాహుల్ రామకృష్ణ లేవనెత్తిన ఈ ప్రశ్నలకు ప్రభుత్వాల నుంచి వచ్చే సమాధానాలు గిరిజన ప్రాంతాల పరిపాలనలోని వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకురావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


