మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు 6 నెలల జైలు శిక్ష.. ఎందుకో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

విశాఖ రైల్వే జోన్ కోసం 2016లో చేపట్టిన నిరాహార దీక్ష కేసులో వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌కి కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. రూ.5 వేల జరిమానా కూడా విధించగా, ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Former Andhra Pradesh Minister Gudivada Amarnath addressing the media regarding the court's verdict in Visakhapatnam.
Former Andhra Pradesh Minister Gudivada Amarnath addressing the media regarding the court's verdict in Visakhapatnam.

వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కి కోర్టు నుంచి గట్టి షాక్ తగిలింది. విశాఖపట్నంలోని రెండో అదనపు ప్రధాన న్యాయస్థానం ఆత్మహత్యాయత్నం కేసులో ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును న్యాయమూర్తి వరలక్ష్మి ప్రకటించారు.

ఈ కేసు 2016 ఏప్రిల్ 14న జరిగిన ఘటనకు సంబంధించినది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం విశాఖపట్నంను కేంద్రంగా చేసుకుని ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అమర్‌నాథ్ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

ఆత్మ‌హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు..

దీక్ష నాలుగు రోజులకే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు జోక్యం చేసుకుని, వైసీపీ నాయకుల నిరసనల మధ్యే ఆయనను కింగ్ జార్జ్ ఆసుపత్రికు తరలించారు. అనంతరం ఈ ఘటనపై విశాఖపట్నం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అమర్‌నాథ్‌పై ఆత్మహత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేశారు.

దీర్ఘకాలంగా కొనసాగిన ఈ కేసు విచారణకు తాజాగా ముగింపు పలికిన కోర్టు, ఆరోపణలు రుజువయ్యాయని నిర్ధారించి శిక్ష విధించింది. కోర్టు తీర్పుపై స్పందించిన అమర్‌నాథ్, ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే, అప్పట్లో తాము చేసిన పోరాటం వల్లే విశాఖకు రైల్వే జోన్ సాధ్యమైందని ఆయన వ్యాఖ్యానించారు.

త‌ప్పుడు కేసు..

ఇదిలా ఉండగా, ఈ పరిణామాలపై వైసీపీ సోషల్ మీడియాలో స్పందించింది. ఉత్తరాంధ్ర ప్రజల కోసం రైల్వే జోన్ సాధనలో అమర్‌నాథ్ చేసిన పోరాటాన్ని గుర్తుచేసింది. 2016లో జరిగిన నిరాహార దీక్షకు సంబంధించి అప్పటి ప్రభుత్వమే తప్పుడు కేసు నమోదు చేసిందని పార్టీ ఆరోపించింది.

గుడివాడ అమర్‌నాథ్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైంది. 2006లో విశాఖపట్నంలో కార్పొరేటర్‌గా గెలిచి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2011లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా, అనకాపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు.

2014లో అనకాపల్లి లోక్‌సభ స్థానానికి పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అయితే 2019లో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి కూడా చేపట్టారు. 2024 ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

అమర్‌నాథ్ కుటుంబానికి కూడా రాజకీయాల్లో మంచి గుర్తింపు ఉంది. ఆయన తండ్రి గుడివాడ గురునాథరావు ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలందించారు. 1985లో పెందుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆయన, 1989లో తిరిగి పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి ప్రవేశించారు. అనంతరం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

తరువాత 1998లో అనకాపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 1999లో అదే స్థానం నుంచి మరోసారి పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు.

Also Read:

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »