హైదరాబాద్: ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ, దేశీయంగా బంగారం , వెండి ధరలు మాత్రం సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. సాధారణంగా యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి వైపు మొగ్గు చూపుతారు, దీనివల్ల ధరలు పెరుగుతాయి. కానీ, ఇందుకు విరుద్ధంగా గడిచిన మూడు రోజులుగా పసిడి రేట్లు భారీగా దిగిరావడం విశేషం. డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడం, బాండ్ ఈల్డ్స్ పెరగడం వంటి పరిణామాలు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో మార్చి 15న హైదరాబాద్ మార్కెట్లో నమోదైన తాజా ధరల వివరాలు ఇప్పుడు చూద్దాం..
భారీగా పడిపోయిన బంగారం ధరలు:
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా మూడో రోజు కూడా పసిడి ధరలు కుప్పకూలాయి. గత మూడు రోజుల్లోనే 24 క్యారెట్ల బంగారంపై దాదాపు రూ. 2,600 పైగా తగ్గుదల కనిపించింది.
24 క్యారెట్ల బంగారం: నేడు ఒక్కరోజే తులం (10 గ్రాములు) బంగారంపై రూ. 1,030 మేర పడిపోయింది. దీంతో నేటి ధర రూ. 1,59,660 వద్దకు చేరింది.
22 క్యారెట్ల బంగారం: ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పసిడి ధర కూడా నేడు రూ. 950 మేర తగ్గింది. ఫలితంగా నేడు 10 గ్రాముల ధర రూ. 1,46,350 వద్ద కొనసాగుతోంది.
వెండి రేటులో భారీ మార్పు:
బంగారం దారిలోనే వెండి కూడా భారీగా పతనాన్ని చవిచూసింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధరపై నేడు ఏకంగా రూ. 10,000 మేర కోత పడింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి రూ. 2,80,000 మార్కు వద్దకు దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ రేటు 5 శాతం మేర తగ్గడం దేశీయ మార్కెట్ ధరలపై తీవ్ర ప్రభావం చూపింది.
ధరలు తగ్గడానికి కారణాలేంటి?
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ, ఇన్వెస్టర్లు ప్రస్తుతం డాలర్‌ను సురక్షితమైన ఆస్తిగా భావించి పెట్టుబడులు మళ్లించడం వల్ల బంగారంపై ఒత్తిడి పెరిగింది. అలాగే, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు 98 డాలర్ల మేర తగ్గి 5,020 డాలర్ల వద్దకు చేరడం కూడా మన దేశీయ ధరలు తగ్గడానికి ప్రధాన కారణమైంది. నిపుణుల అంచనా ప్రకారం, పరిస్థితులు ఇలాగే ఉంటే ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.