ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ధర పెంపు.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు అమలు

నేషనల్ హైవేలపై తరచూ ప్రయాణించే వాహనదారులకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కీలక సమాచారం ఇచ్చింది. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ధరను 2.5 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త ధరలు 2026 ఏప్ర

FASTag Annual Pass Fees

నేషనల్ హైవేలపై ప్రయాణాన్ని సులభతరం చేయడంతో పాటు టోల్ ఖర్చును తగ్గించేందుకు ప్రవేశపెట్టిన ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) తాజాగా పెంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ పాస్ ఫీజును 2.5 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెరిగిన ధరలు వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

గతంలో ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర రూ.3,000గా ఉండేది. తాజా పెంపుతో అది రూ.3,075కు చేరింది. ముఖ్యంగా నాన్-కమర్షియల్ వాహనాలు అయిన సొంత కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమే ఈ పాస్ వర్తిస్తుంది. హైవేలపై తరచూ ప్రయాణించే వారికి టోల్ చార్జీల భారం తగ్గించేందుకు ఈ పాస్‌ను ప్రవేశపెట్టారు.

ల‌భిస్తున్న స్పంద‌న‌..

ఎన్‌హెచ్‌ఏఐ ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ విధానాన్ని గత సంవత్సరం ఆగస్టు 15న ప్రారంభించింది. ఈ పాస్ ద్వారా ఒక ఏడాది కాలంలో లేదా గరిష్టంగా 200 సార్లు నేషనల్ హైవే టోల్ ప్లాజాల వద్ద ప్రయాణించవచ్చు. టోల్ ఫీజు ఎంత ఉన్నా ఈ పాస్ ఉన్న వాహనదారులకు అదనపు చార్జీలు ఉండవు. 200 ట్రిప్పులు పూర్తయ్యాక లేదా ఏడాది గడిచాక ఈ పాస్ ఆటోమేటిక్‌గా సాధారణ ఫాస్టాగ్‌లా మారిపోతుంది. ట్రిప్పులు పూర్తయితే ఏడాది ముగియకముందే మరో కొత్త పాస్ కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది.

Also Read: మార్చి 22న రైతు భరోసా మొదటి విడత విడుదల

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పాస్‌కు మంచి స్పందన లభిస్తోంది. కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో 50 లక్షల మందికి పైగా వాహనదారులు ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను వినియోగిస్తున్నారు. హైవేలపై కార్ల ద్వారా జరిగే మొత్తం టోల్ లావాదేవీల్లో దాదాపు 28 శాతం ఈ పాస్ ద్వారానే జరుగుతున్నాయి.

11.86 కోట్ల ట్యాగ్‌లు జారీ…

ఫాస్టాగ్ వ్యవస్థను 2016లో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 11.86 కోట్ల ట్యాగ్‌లు జారీ చేశారు. అందులో ప్రస్తుతం 5.9 కోట్ల ఫాస్టాగ్‌లు యాక్టివ్‌గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలోని టోల్ వసూళ్లలో 98 శాతం కంటే ఎక్కువ డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయి.

ఫాస్టాగ్ వార్షిక పాస్ వినియోగంలో దిల్లీ-గురుగ్రామ్ సరిహద్దులో ఉన్న బిజ్వాసన్ టోల్ ప్లాజా అగ్రస్థానంలో ఉంది. అక్కడ 57 శాతం మంది వాహనదారులు ఈ పాస్‌ను వినియోగిస్తున్నారు. అలాగే దిల్లీలోని ముండ్కా టోల్ ప్లాజా, సోనిపట్‌లోని ఝింజోలి ఫీ ప్లాజాల్లో కూడా 53 శాతం వరకు వాహనదారులు ఈ వార్షిక పాస్‌ను ఉపయోగిస్తున్నారు.

మొద‌టి స్థానంలో చండీఘ‌డ్‌

రాష్ట్రాల వారీగా చూస్తే చండీగఢ్ 14 శాతం వినియోగంతో మొదటి స్థానంలో ఉంది. తరువాత తమిళనాడు 12.3 శాతం, దిల్లీ 11.5 శాతం వినియోగంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,150 నేషనల్ హైవేలు మరియు ఎక్స్‌ప్రెస్‌వే టోల్ ప్లాజాల వద్ద మాత్రమే పనిచేస్తుంది. స్టేట్ హైవేలు లేదా స్థానిక సంస్థలు నిర్వహించే టోల్ గేట్ల వద్ద మాత్రం సాధారణ ఫాస్టాగ్ చార్జీలు వర్తిస్తాయి.

ఈ పాస్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు ‘రాజమార్గయాత్ర’ మొబైల్ యాప్ లేదా ఎన్‌హెచ్‌ఏఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా పొందవచ్చు. అయితే ఈ యాన్యువల్ పాస్ పూర్తిగా ఐచ్ఛికం మాత్రమే. సాధారణ ఫాస్టాగ్ వాడుతున్న వారు ఎలాంటి మార్పులు లేకుండా తమ ప్రయాణాలను కొనసాగించవచ్చు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »