ఖమ్మం జిల్లా మధిరలో వైరా నది వరద ముంపు నుంచి లోతట్టు ప్రాంతాల ప్రజలను కాపాడేందుకు చేపడుతున్న కాంక్రీట్ కరకట్ట పనులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబర్‌లోపు నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు వేగంగా సాగుతున్నప్పటికీ.. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని స్థానికులు, కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో నాసిరకం ఇసుక, ఇతర మెటీరియల్‌ను వినియోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వరదల నుంచి రక్షణ కోసమే కరకట్ట
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గ కేంద్రమైన మధిరలో అభివృద్ధి పనులు కీలకంగా మారాయి. పట్టణానికి ఆనుకుని ప్రవహించే వైరా నది కారణంగా వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి.
రెండేళ్ల కిందట కురిసిన భారీ వర్షాలకు వైరా నది ఉగ్రరూపం దాల్చడంతో శివాలయం పరిసర ప్రాంతాల్లోని కాలనీలు వరద నీటితో చుట్టుముట్టాయి. పలువురు స్థానికులు నిరాశ్రయులయ్యారు. దీంతో భవిష్యత్తులో వరద ముప్పును తగ్గించేందుకు కరకట్ట నిర్మాణ పనులు చేపట్టారు.
రాయపట్నం వంతెన నుంచి రైల్వే బ్రిడ్జి వరకు సుమారు 2.6 కిలోమీటర్ల మేర, అవతలి వైపు మరో 500 మీటర్ల మేర కాంక్రీట్ కరకట్ట నిర్మాణానికి ప్రభుత్వం రూ.65 కోట్ల నిధులు విడుదల చేసింది. ప్రస్తుతం సుమారు 880 మీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయినట్లు తెలుస్తోంది.
ఇసుక నాణ్యతపై అభ్యంతరాలు
సుమారు నాలుగు నెలల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మధిర పట్టణం వైపు కరకట్ట నిర్మాణం జరుగుతోంది. నిర్మాణానికి రాయపట్నం నుంచి ఇసుక తీసుకురావాల్సి ఉండగా.. సమీపంలోని ఏటి నుంచి ఇసుకను తీసుకుని వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
తవ్వి తీసిన ఇసుకను శివాలయం పరిసర ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. నాణ్యత లేని ఇసుకను ఉపయోగిస్తే భవిష్యత్తులో వరద ఉద్ధృతికి రిటైనింగ్ వాల్ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ను అనుమతించిన ప్రాంతాల నుంచి కాకుండా స్థానికంగానే సేకరిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇసుక, మట్టి, సిమెంట్ వంటి నిర్మాణ సామగ్రి నాణ్యతపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు
కరకట్ట నిర్మాణం పూర్తయిన తర్వాత అది ఏళ్ల తరబడి ప్రజలకు రక్షణ కల్పించాల్సి ఉంటుందని స్థానికులు అంటున్నారు. అలాంటి కీలక నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడితే భారీ వర్షాలు, వరదల సమయంలో మళ్లీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాణ పనులను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి మెటీరియల్ నాణ్యతను పరిశీలించాలని కోరుతున్నారు. ప్రజాధనంతో చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్నది అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పంట పొలాలపైనా ఆందోళన
కరకట్ట పనులు కేవలం కాలనీల వైపే కాకుండా పంట పొలాల రక్షణను కూడా దృష్టిలో పెట్టుకుని చేపట్టాలని రైతులు కోరుతున్నారు. భారీ వర్షాలతో వైరా నది ఉప్పొంగితే పంట పొలాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాలనీల వైపు రెండు వంతెనల మధ్య సుమారు కిలోమీటర్ మేర రిటైనింగ్ వాల్ నిర్మిస్తే సరిపోదని, అవసరమైన మేరకు కరకట్ట పొడవును పెంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కాలనీల నుంచి వచ్చే మురుగు నీరు నదిలోకి చేరకుండా డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పనులు నాణ్యంగా పూర్తి చేయాలని డిమాండ్
రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత డ్రైనేజీ పనులను కూడా చేపట్టి.. మొత్తం ప్రాజెక్టును డిసెంబర్‌లోపు నాణ్యతతో పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
నిర్మాణంలో ఉపయోగించే గ్రావెల్, ఇసుక, మట్టి తదితర మెటీరియల్ విషయంలో నిబంధనలు పాటించడం లేదని కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పందించి వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించాలని కోరుతున్నారు.
కరకట్ట నిర్మాణంలో నాణ్యత లోపిస్తే భవిష్యత్తులో భారీ వరదలు వచ్చినప్పుడు రిటైనింగ్ వాల్ దెబ్బతినే ప్రమాదం ఉందని మధిర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు సంబంధిత అధికారులు పనుల నాణ్యతను పరిశీలించి, లోపాలు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది.
వరద ముంపు నుంచి ప్రజలను రక్షించేందుకు చేపడుతున్న ఈ నిర్మాణం భవిష్యత్తులో పటిష్టమైన రక్షణగా నిలవాలంటే నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు, ప్రజాధనంతో ముడిపడి ఉన్న పనుల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని కోరుతున్నారు.


