ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన చిన్న కుమారుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, యువ హీరో అల్లు శిరీష్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి నయనికతో శిరీష్ వివాహం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ వివాహాన్ని పూర్తిగా ప్రైవేట్ ఈవెంట్‌గా నిర్వహించడం విశేషం.
హైదరాబాద్ నగరంలోని కొల్లూరు ప్రాంతంలో ఉన్న ఐనా ఈవెంట్ స్పేస్ వేదికగా ఈ పెళ్లి వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొద్దిమంది సినీ మరియు రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ జంట పెళ్లి పీటలెక్కింది. పెళ్లి కార్యక్రమం సంప్రదాయబద్ధంగా, ఎంతో ఆత్మీయంగా జరిగింది.
రేవంత్ రెడ్డి సందడి
ఈ వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి ఆశీర్వదించారు. అనంతరం వధూవరులతో పాటు అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లతో కలిసి సీఎం ఫోటోలు దిగారు.
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు. వీరితో పాటు కొద్దిమంది బంధుమిత్రులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మాత్రమే ఈ పెళ్లికి హాజరైనట్లు సమాచారం.
ఇక పెళ్లికి ముందు మూడు రోజుల క్రితం అల్లు శిరీష్ – నయనికల ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది ప్రముఖులు భారీగా హాజరయ్యారు. అయితే ప్రధాన పెళ్లి కార్యక్రమాన్ని మాత్రం చాలా పరిమిత అతిథులతో ప్రైవేట్‌గా నిర్వహించారు.
ప్రేమకథ పెళ్లి బంధంగా..
అల్లు శిరీష్, నయనికలు గత నాలుగైదేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ కార్యక్రమాల్లో పరిచయం అయిన వీరిద్దరి స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. అనంతరం ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఈ ప్రేమ కథ పెళ్లి బంధంగా మారింది.
నయనిక నేపథ్యం గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆమె హైదరాబాద్‌లో స్థిరపడిన వ్యాపార కుటుంబానికి చెందినవారని సమాచారం. అలాగే హీరో నితిన్ భార్య షాలినికి బంధువు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఫ్యామిలీ ఫంక్షన్లలో పరిచయం అయిన శిరీష్, నయనికల మధ్య అనుబంధం పెరిగి ప్రేమగా మారిందని చెప్పుకుంటున్నారు.
అయితే నయనిక కుటుంబానికి వ్యాపార, రాజకీయ రంగాల్లో మంచి పరిచయాలు ఉన్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. కొన్ని రాజకీయ కుటుంబాలతో దూరపు బంధుత్వం ఉందనే ప్రచారం కూడా జరుగుతున్నప్పటికీ, దీనిపై అధికారిక సమాచారం మాత్రం బయటకు రాలేదు.
ప్రస్తుతం అల్లు శిరీష్ – నయనికల వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగా కుటుంబంలో జరిగిన ఈ పెళ్లి వేడుక ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.