హైదరాబాద్‌లో దేవి నవరాత్రి వేడుకలు.. కోఠిలో 81 అడుగుల దుర్గామాత విగ్రహం

హైదరాబాద్ కోఠిలోని విక్టోరియా ప్లే గ్రౌండ్‌లో దేవి నవరాత్రి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి 81 అడుగుల దుర్గామాత విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

కోఠి దుర్గామాత ఉత్సవాలు
కోఠి దుర్గామాత ఉత్సవాలు

దేవి నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. ఉత్సవాల కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో దుర్గామాత విగ్రహాలను తీర్చిదిద్దుతున్నారు. కోఠిలోని విక్టోరియా ప్లే గ్రౌండ్‌లో ఈసారి 81 అడుగుల ఎత్తైన దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ నవదుర్గా నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత 27 ఏళ్లుగా ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

ప్రతి ఏడాది ప్రత్యేక ఆకృతిలో అమ్మవారి విగ్రహాన్ని రూపొందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే తమ ఉత్సవాలకు సంబంధించి ఏడు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈసారి కూడా భారీ విగ్రహంతో భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

గతంలో 65 అడుగుల ఎత్తులో దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, గతేడాది 72 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈసారి దానికంటే ఎత్తుగా 81 అడుగుల విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.

45 రోజులుగా విగ్రహ తయారీ

అమ్మవారి విగ్రహం తయారీ కోసం దాదాపు ఆరు నెలల ముందుగానే ప్రణాళిక ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. విగ్రహ తయారీ పనులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన నాగేశ్ ఆధ్వర్యంలోని 28 మంది కళాకారులు చేపట్టారు. మూడు షిఫ్టుల్లో సుమారు 45 రోజుల పాటు పనులు కొనసాగాయి.

విగ్రహ తయారీలో తెలంగాణ మట్టితో పాటు పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తా నుంచి ప్రత్యేకంగా మట్టిని తీసుకొచ్చారు. మొత్తం మట్టి పరిమాణం ఒక టన్నుకు పైగానే ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో తెలంగాణ మట్టినే ఎక్కువగా ఉపయోగించినట్లు చెప్పారు.

మట్టి పొరలను ఏర్పాటు చేసి, అవి పూర్తిగా ఆరిన తర్వాత మళ్లీ ఫినిషింగ్ పనులు చేపట్టారు. చివరగా కలకత్తా నుంచి తీసుకొచ్చిన మట్టితో విగ్రహానికి తుదిరూపాన్ని ఇస్తున్నారు. విగ్రహానికి వాటర్ పెయింట్స్ మాత్రమే ఉపయోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సమ్మక్క-సారక్క, పూరి జగన్నాథుడి రూపాలు

ఈసారి దుర్గామాత విగ్రహానికి ప్రత్యేక రూపాన్ని తీసుకొచ్చారు. తెలంగాణకు చెందిన సమ్మక్క-సారక్క రూపాలతో పాటు పైన పూరి జగన్నాథ స్వామి రూపాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఏడాది అమ్మవారి విగ్రహంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

నిమజ్జనం అనంతరం మట్టి నీటిలో కలిసిపోయేలా విగ్రహాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. అమ్మవారి విగ్రహానికి ఉపయోగించిన మట్టిని భక్తులు కూడా ప్రత్యేకంగా తీసుకెళ్తున్నారని తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే భక్తులు ఈ మట్టిని తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు నిర్వాహకులు చెప్పారు.

ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దర్శనం

అమ్మవారి దర్శనానికి ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు భక్తులకు అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. గతంలో హర్యానా, పంజాబ్, జమ్మూ తదితర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారని చెప్పారు. విమానాల ఆలస్యం కారణంగా అర్ధరాత్రి తర్వాత నగరానికి చేరుకున్న భక్తులు కూడా అమ్మవారి దర్శనం కోసం వచ్చిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.

అమ్మవారి సారీలకు కూడా భక్తుల్లో ప్రత్యేక ఆదరణ ఉందని నిర్వాహకులు చెప్పారు. గత 26 ఏళ్లుగా అమ్మవారి సారీలను భక్తులు సెంటిమెంట్‌గా తీసుకుంటున్నారని తెలిపారు. ఈసారి కూడా కొన్ని సారీలను వేలం ద్వారా, మరికొన్నింటిని లక్కీ డ్రా ద్వారా భక్తులకు అందించనున్నట్లు చెప్పారు.

ఈసారి రోజుకు లక్ష మంది వస్తారని అంచనా

గతేడాది రోజుకు సుమారు 30 వేల నుంచి 40 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారని నిర్వాహకులు తెలిపారు. వారాంతాల్లో ఈ సంఖ్య 50 వేలు దాటిందన్నారు. ఈసారి సోషల్ మీడియాలో ఉత్సవాలకు సంబంధించిన సమాచారం విస్తృతంగా ప్రచారం కావడంతో రోజుకు లక్ష మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

81 అడుగుల ఎత్తుతో రూపొందుతున్న దుర్గామాత విగ్రహం ఈసారి ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »