Driving Licence New Rule: లైసెన్స్ కోసం 3 గంటల వీడియో తప్పనిసరి.. ఇదే కారణం!

Driving Licence New Rule: డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఇక రోడ్డు భద్రతపై రూపొందించిన వీడియో కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫేస్ రికగ్నిషన్, 6 మాడ్యూల్స్, 64 రహదారి భద్రతా నియమాల వివరాలు తెలుసుకోండి.

Driving Licence New Rule
Driving Licence New Rule

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఇకపై కేవలం పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోదు. రహదారి భద్రతకు సంబంధించిన ప్రత్యేక ఆన్‌లైన్ వీడియో కోర్సును పూర్తిగా చూడాల్సిందే. ఈ వీడియోను పూర్తి చేసిన తర్వాతే డ్రైవింగ్ లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడం, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ వంటి నిబంధనల ఉల్లంఘనల వల్ల ఎదురయ్యే పరిణామాలను వివరించడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశమని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇప్పటివరకు ఎలా ఉండేది?

ఇప్పటివరకు లెర్నింగ్ లైసెన్స్ కోసం ఎల్ఎల్ఆర్ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన తర్వాత సంబంధిత మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ద్వారా లెర్నింగ్ లైసెన్స్ మంజూరు చేసేవారు. అనంతరం పూర్తి స్థాయి డ్రైవింగ్ లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకుని డ్రైవింగ్ ట్రాక్‌పై నిబంధనల ప్రకారం వాహనం నడిపితే లైసెన్స్ జారీ చేసేవారు.

అయితే ఇప్పుడు ఈ ప్రక్రియలో రవాణా శాఖ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. లెర్నింగ్ లైసెన్స్ పొందిన తర్వాత పూర్తి స్థాయి డ్రైవింగ్ లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలంటే ముందుగా రహదారి భద్రతపై రూపొందించిన ఆన్‌లైన్ వీడియో కోర్సును పూర్తి చేయడం తప్పనిసరి చేసింది.

సుమారు మూడు గంటల వీడియో.. ఆరు మాడ్యూల్స్

ఈ ఆన్‌లైన్ కోర్సులో మొత్తం ఆరు మాడ్యూల్స్ ఉంటాయి. ఒక్కో మాడ్యూల్‌లో రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, సురక్షిత డ్రైవింగ్‌కు సంబంధించిన అంశాలను వివరించారు. మొత్తం కోర్సు సుమారు మూడు గంటల నిడివితో ఉంటుంది.

తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఈ వీడియోలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం 64 రకాల రహదారి భద్రతా నియమాలు, ప్రాక్టికల్ డ్రైవింగ్‌కు సంబంధించిన అంశాలను ఇందులో పొందుపరిచారు.

ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో పర్యవేక్షణ

ఈ కోర్సును అభ్యర్థి పూర్తిగా చూస్తున్నాడా లేదా అన్నది నిర్ధారించేందుకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. వీడియో చూస్తున్న సమయంలో అభ్యర్థి స్క్రీన్ నుంచి పక్కకు వెళ్లినా లేదా ముఖం కనిపించకపోయినా వీడియో పాజ్ అయ్యే విధంగా వ్యవస్థను రూపొందించారు.

కోర్సు పూర్తిగా పూర్తి చేసిన తర్వాతే డ్రైవింగ్ లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకునేందుకు సిస్టమ్ అనుమతిస్తుంది.

డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి మైనర్ డ్రైవింగ్ వరకు

రహదారి భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు చట్టాలను ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాలను కూడా వీడియోలో వివరించారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ ధరించకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన ఇబ్బందుల గురించి వివరించారు.

లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను కూడా అభ్యర్థులకు తెలియజేస్తున్నారు.

ఇప్పటివరకు 4,800 మందికి పైగా వీక్షణ

ఈ ఆన్‌లైన్ కార్యక్రమాన్ని తొలుత ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఇప్పటివరకు సుమారు 4,800 మంది అభ్యర్థులు ఈ వీడియో కోర్సును పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రహదారి భద్రతపై ఉపయోగకరమైన సమాచారం అందడంతో అభ్యర్థుల నుంచి సానుకూల స్పందన వస్తోందని చెప్పారు.

వీడియోలో చెప్పే అంశాలను డ్రైవింగ్ సమయంలో ఆచరణలో పెట్టడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.

కూకట్‌పల్లి నుంచి రాష్ట్రవ్యాప్తంగా..

కూకట్‌పల్లి ఆర్టీఓ కార్యాలయంలో ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.

డ్రైవింగ్ లైసెన్స్ పొందడం కేవలం వాహనం నడపగలిగే సామర్థ్యానికి సంబంధించిన ప్రక్రియ మాత్రమే కాకుండా.. రహదారిపై ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన బాధ్యత అని అవగాహన కల్పించడమే ఈ కొత్త విధానం ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »