Nagole Accident: కారు ఢీకొట్టడంతో వాటర్ పైప్‌లైన్ ధ్వంసం.. పలు ప్రాంతాలకు నీటి కష్టాలు!

Nagole Accident: నాగోల్ మెట్రో స్టేషన్ సమీపంలో కారు ఎయిర్ వాల్వ్‌ను ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. డ్రైవర్ మృతి చెందగా, వాటర్ పైప్‌లైన్ దెబ్బతింది. పలు ప్రాంతాల్లో నీటి సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Nagole Accident
Nagole Accident

హైదరాబాద్‌ నాగోల్‌లో తెల్లవారుజామున భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పల్‌ నుంచి ఎల్బీనగర్‌ వైపు వెళ్తున్న ఓ కారు నాగోల్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో అదుపుతప్పి జలమండలికి చెందిన కృష్ణా ఫేజ్‌-2 పైప్‌లైన్‌ ఎయిర్‌ వాల్వ్‌ను ఢీకొట్టింది. దీంతో కారు గాల్లోకి ఎగిరి, సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్‌ పంపు పక్కన ఉన్న ఓ షెడ్‌ను ఢీకొని అక్కడే నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడిని పునీత్‌ చౌదరిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆయన హయత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా సమాచారం.

గాల్లోకి ఎగిసిన నీరు

కారు ఢీకొనడంతో కృష్ణా ఫేజ్‌-2కు సంబంధించిన ఎయిర్‌ వాల్వ్‌ దెబ్బతింది. దీంతో పైప్‌లైన్‌ నుంచి భారీగా నీరు ఒక్కసారిగా ఎగిసిపడింది. మెట్రో స్టేషన్‌ సమీపంలో నీరు పెద్ద ఎత్తున పైకి ఎగిసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ప్రమాదం జరగడంతో స్థానికులు వెంటనే పోలీసులకు, జలమండలి అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకుని నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు అత్యవసర చర్యలు చేపట్టారు. సుమారు ఉదయం 6 గంటల వరకు నీరు భారీగా ఎగిసిపడినట్లు సమాచారం.

జలమండలి ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి

పండగ నేపథ్యంలో ముందుగానే ఏర్పాటు చేసిన జలమండలి ఎమర్జెన్సీ టీమ్స్‌ ఈ ఘటనపై వెంటనే స్పందించాయి. పైప్‌లైన్‌ దెబ్బతినడంతో ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

దెబ్బతిన్న ఎయిర్‌ వాల్వ్‌కు సంబంధించిన పైభాగంలోని పైప్‌లైన్లను ఆపివేసి నీటి ప్రవాహాన్ని నియంత్రించారు. రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక మోటార్లను ఉపయోగించి నీటిని తరలించారు.

పలు ప్రాంతాల్లో నీటి సరఫరాపై ప్రభావం

కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సప్లై ఫేజ్‌-2కు సంబంధించిన పైప్‌లైన్‌ దెబ్బతినడంతో దాని ద్వారా నీటి సరఫరా జరిగే పలు ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు.

ఈ పైప్‌లైన్‌ ద్వారా నీటి సరఫరా జరిగే ప్రాంతాల్లో బీఎన్‌ రెడ్డినగర్‌, వనస్థలిపురం, ఆటోనగర్‌, బీరప్పగడ్డ, రామంతపూర్‌, ఉప్పల్‌, ప్రకాష్‌నగర్‌, మేకలమండి, పద్మారావునగర్‌, బేగంపేట, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే, ఎంఈఎస్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, లాలాపూడ, అడ్డగుట్ట, నల్లగుట్ట, మెట్టుగూడ, వైశాలినగర్‌, మీర్‌పేట్‌, బడంగ్‌పేట్‌, బాలాపూర్‌, మైసారం, మారేడ్‌పల్లి తదితర ప్రాంతాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

పండగ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు జలమండలి అధికారులు పేర్కొన్నారు. అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు.

మరమ్మతు పనులను పరిశీలించిన జలమండలి ఎండీ

పైప్‌లైన్‌ మరమ్మతు పనులపై జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఆపరేషన్స్‌, మెయింటెనెన్స్‌, ట్రాన్స్‌మిషన్‌ విభాగాల అధికారులు సమన్వయంతో మరమ్మతు పనులు చేపట్టారు.

దెబ్బతిన్న పైప్‌లైన్‌ భాగాన్ని తొలగించి, ఆ ప్రాంతంలో కొత్త పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రభావిత ప్రాంతాలకు తాగునీటి సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.

పండగ కావడంతో తప్పిన ట్రాఫిక్‌ ఇబ్బందులు

సాధారణ రోజుల్లో ఉదయం 9 గంటల సమయంలో నాగోల్‌ మెట్రో స్టేషన్‌ నుంచి ఉప్పల్‌, ఎల్బీనగర్‌ మార్గాల్లో భారీగా ట్రాఫిక్‌ ఉంటుంది. అయితే పండగ నేపథ్యంలో వాహనాల రాకపోకలు తక్కువగా ఉండటంతో పెద్దగా ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడలేదని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు ప్రమాదానికి గురైన కారును పోలీసులు అక్కడి నుంచి తొలగించే చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సమాచారం. కారును కూడా ఘటనాస్థలం నుంచి తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ప్రస్తుతం దెబ్బతిన్న పైప్‌లైన్‌ను మార్చి కొత్త పైప్‌లైన్‌ ఏర్పాటు చేయడంతో ఆయా ప్రాంతాలకు వీలైనంత త్వరగా తాగునీటి సరఫరాను పునరుద్ధరించేందుకు జలమండలి అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »