హైదరాబాద్ నగరంలో మానవత్వాన్ని తలదించుకునే ఘోర సంఘటన చోటుచేసుకుంది. మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలోని హైదరాబాద్ పరిధిలో ఉన్న బౌరంపేట ప్రాంతంలో కన్నతల్లే తన రెండు నెలల శిశువును అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేంద్ర ఆదివాసి (21), మమత అహిర్వార్ (20) దంపతులు ఉపాధి కోసం నగరానికి వలస వచ్చారు.
హైదరాబాద్ బౌరంపేటలోని ఓ నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ వద్ద కార్మికులుగా పనిచేస్తూ, అక్కడే ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక షెడ్డులో నివసిస్తున్నారు. ఈ దంపతులకు రెండు నెలల వయస్సు గల కుమారుడు ఉన్నాడు.
ఏడుస్తున్నాడన్న కోపంతో కిరాతకం
సోమవారం రాత్రి శిశువు నిరంతరం ఏడుస్తుండటంతో తల్లి మమత తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. బాబు ఏడుపు ఆపాలని ప్రయత్నిస్తూ అతని నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి, అనంతరం మండుతున్న కట్టెల పొయ్యిలో పడేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: జనగాంలో కొత్త హెల్త్ మిషన్ మొదలు… 30 ఏళ్లు దాటిన వారందరికీ ఏమి చెక్ చేస్తారు?
భర్త అనుమానం… బయటపడిన నిజం
పని ముగించుకుని ఇంటికి వచ్చిన తండ్రి రాజేంద్రకు బాబు కనిపించకపోవడంతో భార్యను ప్రశ్నించాడు. ఆమె పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానం వచ్చిన రాజేంద్ర చుట్టుపక్కల వెతికాడు. చివరకు పొయ్యిలో కాలిపోయిన స్థితిలో శిశువు మృతదేహం కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు.
భర్త ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితురాలైన మమతను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
దారుణ ఘటనపై పోలీసులు దర్యాప్తు
ఈ సంఘటన స్థానికులను కలవరపరచడంతో పాటు సభ్యసమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కుటుంబ పరిస్థితులు, మానసిక స్థితి వంటి అంశాలపై కూడా పోలీసులు కోణాలు పరిశీలిస్తున్నారు.