హైదరాబాద్‌లో సాధారణ జ్వరంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆరు నెలల పసికందు, చికిత్స అనంతరం మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. క్రేయాన్స్ ఆసుపత్రిలో ఎక్స్‌పైరీ అయిన ఇంజెక్షన్ వాడటం, అత్యవసర మందు ఇవ్వడం వంటి ఆరోపణలు వెల్లువెత్తడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
వైద్యం అంటే ప్రాణాలు కాపాడే సేవ అని నమ్మిన ఓ కుటుంబానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. సాధారణ జ్వరంతో బాధపడుతున్న ఆరు నెలల పసికందును మెరుగైన వైద్యం అందుతుందనే ఆశతో హైదరాబాద్‌లోని క్రేయాన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స అనంతరం చిన్నారి మృతి చెందిన ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.
ఎక్స్‌పైరీ ఇంజెక్షన్ ఆరోపణ
తల్లిదండ్రుల వివరాల ప్రకారం, బాబును పరీక్షించిన వైద్యుడు జ్వరం తగ్గించేందుకు ఇంజెక్షన్ ఇవ్వాలని సూచించారు. అయితే, ఆ సమయంలో కనీస జాగ్రత్తలు పాటించకుండా గడువు ముగిసిన ఇంజెక్షన్‌ను వాడినట్లు ఆరోపిస్తున్నారు. ఆ ఇంజెక్షన్ గడువు ఈ ఏడాది జనవరిలోనే ముగిసిపోయిందని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.గడువు ముగిసిన మందులు ప్రాణాంతకమని తెలిసి కూడా వాటిని వినియోగించడం వైద్య నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు ఆరోపిస్తున్నారు.
అత్యవసర మందు వినియోగంపై సందేహాలు
మరో కీలక ఆరోపణ ఏమిటంటే, సాధారణ జ్వరంతో వెళ్లిన చిన్నారికి హార్ట్ ఫంక్షనింగ్ ఆగిపోయిన సందర్భాల్లో వాడే అత్యవసర ఐవీ ఇంజెక్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పరిశీలించకుండా శక్తివంతమైన మందు వాడటంతో శరీరం దాన్ని తట్టుకోలేకపోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంజెక్షన్ ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే బాబు రంగు మారిపోయి, పరిస్థితి విషమించిందని వారు చెబుతున్నారు. ఆసుపత్రి వర్గాలు మాత్రం చికిత్స ప్రక్రియలో అన్ని ప్రమాణాలు పాటించామని పేర్కొన్నట్లు సమాచారం.
ఆందోళనకు దిగిన బంధువులు
ఈ ఘటనతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టిన బాబు కావడంతో ఎంతో ఆశలు పెట్టుకున్నామని, దేవుళ్లను ప్రార్థించి పొందిన సంతానాన్ని వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కోల్పోయామని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. బాబు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో కొందరు ఆసుపత్రిలోని ఫార్మసీపై ధ్వంసానికి పాల్పడినట్లు సమాచారం.
పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు వైద్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన మందులు ఎలా వినియోగంలోకి వచ్చాయి? సాధారణ జ్వరానికి అత్యవసర ఇంజెక్షన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

