చంచల్‌గూడ జైలు కేంద్రంగా ఉగ్రకుట్ర అనుమానం.. హైదరాబాద్‌లో హై అలర్ట్

హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. చంచల్‌గూడ జైలు ములాఖత్ వ్యవస్థను వినియోగించుకుని దాడులకు ప్లాన్ చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Hyderabad Terror Alert
Hyderabad Terror Alert

హైదరాబాద్ నగరంలో మరోసారి ఉగ్ర ముప్పు ముసురుకుంటుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం, నగరంలో భారీ విధ్వంసానికి కొందరు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కుట్రకు కేంద్రంగా చంచ‌ల్‌గూడ జైలు మారిందని అధికారులు భావిస్తున్నారు.

ములాఖత్ సమయంలోనే ప్లానింగ్?

జైలులో ఉన్న ఖైదీలను కలిసేందుకు వచ్చే ‘ములాఖత్’ సమయంలోనే ఉగ్రదాడులకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తున్నారనే సమాచారం నిఘా వర్గాలకు అందినట్లు తెలుస్తోంది. జైలులో నిర్బంధంలో ఉన్న కొందరు ఉగ్రవాదులు, వారిని కలిసేందుకు వచ్చే వ్యక్తులతో నగరంలో దాడులపై చర్చలు జరిపినట్లు అనుమానిస్తున్నారు.

ఈ కుట్ర వెనుక నిషేధిత ఉగ్రవాద సంస్థ ల‌ష్క‌రే తోయిబాకు చెందిన ఓ కీలక వ్యక్తి ఉన్నాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఈ సమాచారంపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు.

గత ఘటనలు గుర్తు చేస్తూ…

హైదరాబాద్‌లో గతంలో పలుమార్లు ఉగ్రదాడులు జరిగిన విషయం తెలిసిందే. గోకుల్ చాట్, లుంబిని పార్క్, మ‌క్కా మ‌సీదు, దిల్‌షుఖ్ న‌గ‌ర్ ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

టార్గెట్ ప్రాంతాల్లో నిఘా

ఉగ్రవాదుల కదలికలు, పాత నేరస్తుల రికార్డులను పరిశీలించిన అధికారులు నగరంలోని ముసారంబాగ్, సైదాబాద్, మలక్‌పేట్ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమానితుల కదలికలపై కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు దృష్టి సారించాయి.

నగరంలో హై అలర్ట్

ములాఖత్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ దాడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నారనే సమాచారంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. జైలుకు వచ్చే సందర్శకుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, వారి గత చరిత్రను వెరిఫై చేస్తున్నారు. అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడంతో పాటు, సీసీటీవీ ఫుటేజీలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు నగర వాసులను కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

మొత్తానికి, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్‌లో భద్రతా వ్యవస్థ మరింత కట్టుదిట్టం చేయబడింది. అధికారికంగా పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »