VC Sajjanar | పోలీస్‌శాఖలో మరో కీలక సాంకేతిక ముందడుగు పడింది. భాష తెలియక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇవ్వడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్ పెడుతూ హైదరాబాద్ సిటీ పోలీస్ ‘ఏఐ కాప్‌రైటర్’ పేరుతో కృత్రిమ మేధ ఆధారిత బహుభాషా ఫిర్యాదు నమోదు యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సాంకేతికతను పోలీసింగ్ వ్యవస్థలో ప్రవేశపెట్టడం విశేషంగా నిలిచింది. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో శనివారం జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఈ యాప్‌ను ఆవిష్కరించారు. అనంతరం యాప్ పనితీరును పరిశీలించి అధికారులతో చర్చించారు. హైదరాబాద్ వంటి అంతర్జాతీయ నగరంలో ఇతర రాష్ట్రాల వలస కార్మికులు, పర్యాటకులు, విదేశీయులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. తెలుగు లేదా ఇంగ్లీష్ తెలియక ఫిర్యాదు చేసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, ఎఫ్‌ఐఆర్ నమోదు జాప్యాలు, సమాచారం తప్పుగా నమోదయ్యే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ యాప్‌ను రూపొందించినట్లు పోలీసులు తెలిపారు.
Read Also : పట్టపగలే చుక్కలు కనిపించేలా అలుముకోనున్న చీకట్లు..! శతాబ్దంలోనే సుదీర్ఘ సూర్యగ్రహణం..!
నగరంలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లలో అందుబాటులోకి రానున్న ఈ యాప్ ద్వారా బాధితుడు తన మాతృభాషలో చెప్పిన ఫిర్యాదును వెంటనే రికార్డు చేసి, అవసరమైన భాషలోకి అనువదించుకోవచ్చు. హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ సహా 10కి పైగా భారతీయ భాషలను ఈ యాప్ గుర్తించగలదు. బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ సంస్థ, ఇంటర్న్ పాగ్రో చందు సహకారంతో హైదరాబాద్ సిటీ పోలీస్ ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. యాప్‌లోని ప్రత్యేక ఫీచర్లు పోలీస్ వ్యవస్థకు మరింత పారదర్శకత, వేగాన్ని తీసుకురానున్నాయి. ఫిర్యాదు నమోదు చేసిన అధికారి వివరాలు, సమయం వంటి సమాచారం ఆటోమేటిక్‌గా పీడీఎఫ్ రూపంలో భద్రపరచబడుతుంది. బాధితుడు, నిందితుడు, సాక్షుల మాటలను వేర్వేరుగా గుర్తించి రికార్డ్ చేసే మల్టీ పార్టీ లేబులింగ్ సదుపాయం కూడా ఇందులో ఉంది. ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడారు. ‘హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారుతున్న నేపథ్యంలో భాష ఎప్పటికీ న్యాయం పొందడంలో అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఈ యాప్‌ను తీసుకొచ్చాం. బాధితుడు మాట్లాడిన ప్రతి మాటను యథాతథంగా నమోదు చేయడం వల్ల దర్యాప్తు నాణ్యత పెరుగుతుంది. మహిళలు, వృద్ధులు, వలస కార్మికులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది’ అని పేర్కొన్నారు. మాట్లాడిన ప్రతి ఐదు సెకన్లకోసారి సమాచారం అప్‌డేట్ అవుతుందని, దీనివల్ల పోలీసు సిబ్బందిపై టైపింగ్ భారం తగ్గడమే కాకుండా రికార్డుల నిర్వహణలో ఏకరీతి వస్తుందని ఆయన వివరించారు.
Read Also : ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. భారీగా పెట్టుబడులు పెడుతున్న ద్విచక్ర వాహనాల కంపెనీ..!
ఇటీవల కాలంలో హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ పోలీసింగ్‌లో ఏఐ వినియోగాన్ని విస్తరిస్తోంది. ఇప్పటికే సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం ‘సి-మిత్ర’ వ్యవస్థలో ఏఐ సాంకేతికతను వినియోగిస్తోంది. సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది పోస్టింగ్‌ల కేటాయింపులో కూడా ఆటోమేటెడ్ ఏఐ విధానాన్ని అమలు చేస్తోంది. సోషల్ మీడియాలో శాంతిభద్రతలకు భంగం కలిగించే పోస్టులను గుర్తించేందుకు ‘సాక్-ఐ’ అనే ఏఐ యాప్‌ను కూడా ఉపయోగిస్తోంది. తాజాగా ‘ఏఐ కాప్‌రైటర్’ ప్రవేశపెట్టడంతో ఫిర్యాదు నమోదు ప్రక్రియ మరింత వేగవంతం, క్రమబద్ధీకరణ దిశగా అడుగులు పడినట్లయిందని అధికారులు భావిస్తున్నారు. కార్యక్రమంలో అదనపు సీపీ (క్రైమ్స్ అండ్ సిట్) ఎం శ్రీనివాసులు, అదనపు సీపీ (లా అండ్ ఆర్డర్) తఫ్సీర్ ఇక్బాల్, డీసీపీ (ఎస్ఎమ్ఐటీ) సీహెచ్ రూపేశ్, ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Also : తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం.. నిజామాబాద్‌లో అత్యధికంగా 45.7 డిగ్రీలు..


