పట్టపగలే చుక్కలు కనిపించేలా అలుముకోనున్న చీకట్లు..! శతాబ్దంలోనే సుదీర్ఘ సూర్యగ్రహణం..!

ఆకాశంలో అరుదైన అద్భుతానికి 2027 సంవత్సరం వేదిక కానుంది. ఆగస్టు 2న సంపూర్ణ సూర్యగ్రహణం (Solar Eclipse) ఏర్పడనుంది. పగటిపూటే కొన్ని నిమిషాల పాటు చీకట్లు కమ్ముకునే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం 21వ శతాబ్దంలోనే అత్యంత దీర్ఘకాలం కొనసాగనుంది. ఈ ఆస్ట్రోనామికల్‌ ఈవెంట్‌ (Astronomical Event) కోసం యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Solar Eclipses | వచ్చే ఏడాది ఆగస్టు 2న ఆకాశంలో అరుదైన అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. 21వ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘంగా కొనసాగే సంపూర్ణ గ్రహంగా నిలువనుంది. ఈ సూర్యగ్రహణం సందర్భంగా పగటిపూటే కొన్ని నిమిషాల పాటు చీకట్లు కమ్ముకోనున్నాయి. ఈ ఖగోళ ఘటన ప్రపంచవ్యాప్తంగా స్కైవాచర్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ గ్రహణం సమయంలో కొన్ని ప్రాంతాల్లో పగటిపూటే కొన్ని నిమిషాల పాటు చీకట్లు కమ్ముకునే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పగటి పూట ఆకాశంలో రాత్రివేళల్లో కనిపించినట్లుగా నక్షతాలు కనిపించే ఛాన్స్‌ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also : థ్యాంక్స్‌ సీఎం రేవంత్‌..! సీఎం రేవంత్‌ చిత్రపటానికి 2008 డీఎస్సీ టీచర్స్‌ పాలాభిషేకం..!

సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది?

భూమి, సూర్యుడి మధ్యలో చంద్రుడు వస్తాడు. ఆ సమయంలో సూర్యకాంతి భూమిని చేరుకోదు. దీన్నే సూర్యగ్రహణంగా పేర్కొంటారు. ఖగోళశాస్త్రంలో అత్యంత కీలకమైన సంఘటనల్లో ఒకటిగా భావిస్తారు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం 2027 ఆగస్టు 2న సంభవించే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం సుమారు 6 నిమిషాల 20 సెకన్ల నుంచి 6 నిమిషాల 23 సెకన్ల వరకు కొనసాగనుంది. ఈ శతాబ్దంలోనే ఎక్కువ సేపు కనిపించే సూర్యగ్రహణం ఇదే కావడం విశేషం. ఈ సమయంలో భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళరేఖలోకి రావడంతో చంద్రుడు పూర్తిగా సూర్యుడిని కప్పివేస్తాడని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇంతకు ముందు 1991 జూలై 11న జరిగిన సంపూర్ణ సూర్యగ్రహణం అత్యంత సుదీర్ఘ గ్రహణాల్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది. ఆ గ్రహణం సుమారు 6 నిమిషాల 53 సెకన్ల పాటు కొనసాగింది. దీన్ని అప్పట్లో ‘ఎక్లిప్స్‌ ఆఫ్‌ ది సెంచరీ’గా పేర్కొన్నారు. ఆ గ్రహణం మెక్సికో, హవాయి, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించింది. పగటిపూటే చీకట్లు కమ్ముకోవడం, పక్షులు గందరగోళానికి గురవడం, ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గిపోవడం తదితర అరుదైన దృశ్యాలు యావత్‌ ప్రపంచాన్ని సంబ్రమాశ్చర్యాలకు గురి చేసింది. తాజాగా ఈ ఏర్పడనున్న గ్రహం ఈ శతాబ్దంలోనే అరుదైన, సుదీర్ఘమైన గ్రహంగా నిలువనుంది.

Read Also : రాయదుర్గం భూములు వేలం వేయనున్న కాంగ్రెస్‌ సర్కారు..! ఒక్కో ఎకరానికి రూ.139 కోట్లు..!

జ్యోతిష్యశాస్త్రం ఏ చెబుతోంది..?

జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. ఈ సూర్యగ్రహణం భారత్‌లో పూర్తిస్థాయిలో కనిపించకపోయినా శ్రావణ మాసం అమావాస్య రోజున సంభవించనుంది. దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పేర్కొంటున్నారు. హిందూ సంప్రదాయంలో సూర్యగ్రహణాన్ని కీలక సమయంగా పేర్కొంటున్నారు. గ్రహణ సమయంలో గ్రహాలు, నక్షత్రాల ప్రభావం భూమిపై, మానవ జీవితంపై ఎక్కువగా ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు. కొందరి జీవితాల్లో అనుకోని మార్పులు జరిగే అవకాశం ఉంది. మరికొందరి జీవితాల్లో కొత్త దారులు తెరుచుకునే సూచనలు ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ప్రతికూల ఆలోచనలు, ఇతరులతో వాదనలకు దిగకుండా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

Read Also :ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రం..! కాన్వాయ్‌లో వాహనాల తగ్గింపు..!

గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?

ఈ అరుదైన సూర్యగ్రహణం దక్షిణ యూరప్‌, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలోని అనేక దేశాల్లో స్పష్టంగా కనిపించనుంది. కొన్ని ప్రాంతాల్లో పగటిపూటే చీకట్లు అలుముకునే పరిస్థితులు ఉంటాయని పేర్కొంటున్నారు. ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పులు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నది. భారత్‌లో ఈ గ్రహణం పూర్తిస్థాయిలో కనిపించకపోయినా, కొన్ని ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపించే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »