రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లో ఉన్న సుమారు 7 ఎకరాల పార్కులు, ప్రజావసరాల స్థలాలను Hyderabad Disaster Response and Assets Monitoring and Protection Agency (హైడ్రా) శనివారం రక్షించింది. ఈ భూముల అంచనా విలువ సుమారు రూ.1400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆక్రమణల నేపథ్యంలో కాలనీ సంక్షేమ సంఘం ఇచ్చిన ఫిర్యాదులపై హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే ఫెన్సింగ్ వేసింది.
కొండాపూర్‌లో 7 ఎకరాల మేర ఉన్న పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను హైడ్రా శనివారం కాపాడింది. వీటి విలువ రూ. 1400ల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ విలేజ్‌లోని సర్వే నంబరు 78 నుంచి 93 లో రాజరాజేశ్వరి నగర్ కాలనీ పేరుతో 2059 ప్లాట్లతో 1993లో గ్రామపంచాయతీ లే ఔట్ వేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 5 ఎకరాలు కేటాయించారు.
అలాగే పాఠశాలకు దాదాపు ఎకరా స్థలం,పార్కుల కోసం ఎకరాకు పైగా కేటాయించారు. పాఠశాలకు కేటాయించిన స్థలంలో 1000 గజాల మేర అపార్టుమెంట్‌ను నిర్మించేశారు. కమ్యూనిటీ హాల్ కోసం 2181 గజాలను కేటాయించారు. ఇలా కేటాయించిన భూములు ఆక్రమణలకు గురౌతున్నాయని వెంటనే కాపాడి రాజరాజేశ్వరి నగర్‌లో నివాసం ఉంటున్న 5 వేల కుటుంబాలకు ఉపయోగపడేలా చూడాలని హైడ్రా ప్రజావాణిలో కాలనీ సంక్షేమ సంఘం కోరింది.
ఈ భూముల ఆక్రమణల వెనుక బడాబాబులున్నారని ఫిర్యాదు చేసింది. పలు షోరూంలతో పాటు.. కిరాణా జనరల్ స్టోర్‌లు వచ్చాయని.. రహదారులు కూడా ఆక్రమణలకు గురౌతున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. యూఎల్సీ భూములలోని లే ఔట్లో ప్లాట్లు ఎల్ ఆర్ ఎస్ అయ్యాయి. పార్కులు, ప్రజావసరాల స్థలాలు ఎల్ ఆర్ ఎస్ అవ్వకుండా ఆక్రమణదారుల సొంతం ఎలా అవుతాయని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. అవి పార్కులాగాను ప్రజావసరాలప్రజావసరాల స్థలాలగానే ఉపయోగపడాలని కోరారు.
ఈ ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో హైడ్రా క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. లే ఔట్ ప్రకారం పార్కుతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలుగా నిర్ధారించుకుంది. పార్కు స్థలంలో ఇప్పటికే వెయ్యి గజాల మేర అపార్టుమెంట్ రాగా.. కమ్యూనిటీ స్థలంలో పైవేటు షాపులు, షెడ్డులు వేసినట్టు గుర్తించింది.
ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు.. అక్కడి నివాసితులకే చెందాలనే ఉద్దేశంతో ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ వేసింది. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. దీంతో రాజరాజేశ్వరి నగర్ నివాసితులు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్య హైడ్రాతో పరిష్కారం అయ్యిందని సంతోషం వ్యక్తం చేశారు.


