అన్నం వండటం చాలా తేలికైన పని అనుకుంటాం. కానీ వండే విధానంలో చేసే చిన్న తప్పులే ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది చేసే పొరపాటు – బియ్యం కడిగిన వెంటనే పొయ్యి మీద పెట్టేయడం.
ఇలా చేస్తే అన్నం సరిగ్గా ఉడకదు. ప్రతి గింజా సమానంగా ఉడకక, జీర్ణం కావడానికీ ఎక్కువ సమయం పడుతుంది. పైగా గ్యాస్ వినియోగం కూడా పెరుగుతుంది. దీర్ఘకాలంలో అజీర్తి వంటి సమస్యలు వేధించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
అసలు చేయాల్సింది ఏమిటంటే..
బియ్యం కడిగాక వెంటనే వండకుండా కనీసం 20 నుంచి 30 నిమిషాలు నానబెట్టాలన్నదే నిపుణుల సూచన. ఈ చిన్న అలవాటుతో కలిగే మార్పులు ఇవే:
- ప్రతి బియ్యపు గింజ సమానంగా ఉడుకుతుంది
- అన్నం అంటుకోకుండా విడివిడిగా, మెత్తగా వస్తుంది
- వంట సమయం తగ్గి గ్యాస్ ఆదా అవుతుంది
- ఆహారం సులభంగా జీర్ణమవుతుంది
- రోజూ అన్నం ఎక్కువగా తినేవారు ఈ పద్ధతిని తప్పక పాటించాలని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు.
షుగర్ ఉన్నవారికి ఎందుకు మేలు?
నానబెట్టిన బియ్యంతో వండిన అన్నం రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నానబెట్టడం వల్ల బియ్యంలో ఎంజైమాటిక్ బ్రేక్‌డౌన్ ప్రక్రియ జరిగి, గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గడానికి దోహదపడుతుందట.
అంటే అన్నం తిన్న వెంటనే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరిగిపోకుండా ఈ పద్ధతి కొంత అడ్డుకట్ట వేస్తుందన్నమాట. అయితే మధుమేహం ఉన్నవారు ఆహార మార్పుల విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం ఎప్పుడూ మంచిది.
పురుగుమందుల అవశేషాలకూ చెక్
ఆధునిక వ్యవసాయంలో వరి సాగులో రకరకాల పురుగుమందులు వాడుతుంటారు. బియ్యం ఉపరితలంపై ఆ రసాయనాల అవశేషాలు, దుమ్ము అంటుకుని ఉండే అవకాశం ఉంటుంది.
బియ్యాన్ని నానబెట్టి, ఆ నీటిని వడపోసి వండటం వల్ల ఇలాంటి అవశేషాలు చాలావరకు తొలగిపోతాయని నిపుణులు వివరిస్తున్నారు. అంటే ఒక్క నానబెట్టే అలవాటుతో శుభ్రత, ఆరోగ్యం రెండూ దక్కుతాయి.
నిద్రకూ, జీర్ణానికీ దోహదం
నానబెట్టిన బియ్యంతో వండిన అన్నం తేలిగ్గా జీర్ణమవుతుంది. దీంతో కడుపుబ్బరం, అజీర్తి వంటి ఇబ్బందులు దూరమవుతాయని చెబుతున్నారు. ఆహారంలోని పోషకాలు శరీరానికి సమంగా అందుతాయి.
అంతేకాదు.. ఈ పద్ధతి మెలటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపించి మంచి నిద్రకు కూడా తోడ్పడుతుందని నిపుణుల మాట. ఖనిజాలు, విటమిన్లు శరీరానికి బాగా శోషణ అయ్యేందుకూ నానబెట్టడం సాయపడుతుంది.
గుర్తుంచుకోవాల్సిన సింపుల్ రూల్
వంట ప్రారంభించడానికి అరగంట ముందే బియ్యం కడిగి నానబెట్టడం అలవాటు చేసుకుంటే చాలు. పెద్దగా శ్రమ లేని ఈ చిన్న మార్పు.. జీర్ణ ఆరోగ్యం నుంచి చక్కెర నియంత్రణ వరకు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుందని ఆహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: Jagan 2.0: మదనపల్లెలో ‘జగన్ 2.0 సూపర్ యాప్’ లాంచ్.. ఫీచర్లు ఇవే!


