అదృశ్యమైన ముగ్గురు బాలికలు క్షేమం

హైదరాబాద్ దోమలగూడకు చెందిన ముగ్గురు బాలికలు అదృశ్యమైన కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఛత్తీస్‌గఢ్‌లో వారిని సురక్షితంగా గుర్తించి హైదరాబాద్‌కు తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Missing Girls-Secunderabad Police
Missing Girls-Secunderabad Police
  • ముగ్గురు బాలికలు ఛత్తీస్‌గఢ్‌లో సురక్షితంగా గుర్తించిన పోలీసులు.
  • సికింద్రాబాద్ పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు.
  • తల్లిదండ్రుల మధ్య గొడవలే ఇంటి నుంచి వెళ్లిపోవడానికి కారణమని బాలికలు వెల్లడించినట్లు డీసీపీ తెలిపారు.

హైదరాబాద్‌లోని దోమలగూడ ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికలు అదృశ్యమైన కేసులో సికింద్రాబాద్ పోలీసులు విజయవంతంగా దర్యాప్తు పూర్తి చేశారు. అదృశ్యమైన చిన్నారులను ఛత్తీస్‌గఢ్‌లో సురక్షితంగా గుర్తించి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం వారిని సఖీ భరోసా సెంటర్‌లో ఉంచి వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.

ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు

ఈ నెల 19న ముగ్గురు బాలికలు కనిపించకుండా పోవడంతో వారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సికింద్రాబాద్ పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్నంగా పరిశీలిస్తూ చిన్నారుల ప్రయాణ మార్గాన్ని గుర్తించారు.

సీసీటీవీలో బయటపడిన ప్రయాణం

దర్యాప్తులో భాగంగా తెల్లవారుజామున 2 గంటల సమయంలో బాలికలు హిమాయత్‌నగర్ నుంచి ఆటోలో కాచిగూడకు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడి నుంచి మరో ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గేట్ నంబర్-8కు చేరుకుని, ప్లాట్‌ఫామ్ నంబర్-6 వద్ద కొంతసేపు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

అనంతరం రైల్వే ట్రాక్ దాటి జేమ్స్ స్ట్రీట్ వైపు వెళ్లి లోకల్ రైలులో ప్రయాణించినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా నిర్ధారించారు. తర్వాత దాన్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి ఛత్తీస్‌గఢ్‌లోని ధంకేర్ జిల్లాకు చేరుకున్నట్లు విచారణలో తేలింది.

అప్రమత్తమైన వ్యక్తి సమాచారం.. సురక్షితంగా రక్షణ

ఛత్తీస్‌గఢ్‌లో పరిచయం ఉన్న ఓ వ్యక్తి వద్ద బాలికలు ఆశ్రయం పొందారు. తమకు ఏదైనా పని ఇప్పించాలని కోరడంతో అతడికి అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో తెలంగాణ పోలీసులు, ఛత్తీస్‌గఢ్ పోలీసులతో సమన్వయం చేసుకుని బాలికలను సురక్షితంగా అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

ప్రస్తుతం సఖీ భరోసా సెంటర్‌లో

ప్రస్తుతం ముగ్గురు బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు కౌన్సెలింగ్ అందిస్తున్నారు. చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన అనంతరం మరో రెండు రోజుల్లో వారిని వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని సికింద్రాబాద్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపారు.

ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ఇదే కారణం

2024లో ఈ కుటుంబం దోమలగూడ ప్రాంతానికి వచ్చి నివాసం ఉంటోందని డీసీపీ వెల్లడించారు. బాలికల వాంగ్మూలం ప్రకారం తల్లిదండ్రుల మధ్య తరచూ జరుగుతున్న గొడవలు, ఇంట్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగానే వారు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని తెలిపారు.

పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా తల్లిదండ్రులు కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని కల్పించాలని, ఏవైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు.

Also Read: మూడో వరుస కామన్వెల్త్ స్వర్ణం గెలిచిన మీరాబాయి చాను

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »