హైదరాబాద్ మెట్రో లాస్ట్ మైల్ కనెక్టివిటీ.. ఈ స్టేషన్ల నుంచి ఫీడర్ సర్వీసులు

హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం లాస్ట్ మైల్ కనెక్టివిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏ మెట్రో స్టేషన్ల నుంచి ఆటోలు, క్యాబ్‌లు, టూ వీలర్లు, ఫీడర్ బస్సులు ఉన్నాయో తెలుసుకోండి.

హైదరాబాద్ మెట్రో స్టేషన్ల నుంచి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఫీడర్ సర్వీసులు
Hyderabad Metro Last Mile Connectivity Feeder Services

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు చివరి గమ్యానికి చేరుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించేందుకు హెచ్ఎంఆర్ఎల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పలు యాప్ ఆధారిత సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని మెట్రో స్టేషన్ల నుంచి వివిధ రకాల ఫీడర్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

మెట్రో రైలు ద్వారా నగరంలోని ప్రధాన ప్రాంతాలకు త్వరగా చేరుకోవచ్చు. అయితే మెట్రో స్టేషన్‌ నుంచి ఇంటికి, కార్యాలయానికి లేదా ఇతర గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌లు, టూ వీలర్లపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ సేవలను విస్తరిస్తున్నారు.

మెట్రో స్టేషన్లలో వివిధ రకాల సేవలు

హెచ్ఎంఆర్ఎల్ వివరాల ప్రకారం నగరంలోని దాదాపు అన్ని మెట్రో స్టేషన్లకు రాపిడో టూ వీలర్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. అలాగే రాయదుర్గ మెట్రో స్టేషన్‌లో హాల్ మొబిలిటీకి చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ సేవలను అందుబాటులో ఉంచారు.

రైడ్ ఈసీ క్యాబ్ సేవలు నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థకు చెందిన ఆటో సేవలను రాయదుర్గ, ఎల్బీనగర్, అమీర్‌పేట్, మియాపూర్, కేపీహెచ్‌బీ కాలనీ, సికింద్రాబాద్, ఉప్పల్, పరేడ్ గ్రౌండ్, హైటెక్ సిటీ, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ల నుంచి పొందవచ్చు.

అలాగే మన యాత్రి ఆటో సేవలు నగరంలోని 57 మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉన్నట్లు మెట్రో యాజమాన్యం తెలిపింది.

ఈ మెట్రో స్టేషన్ల నుంచి ఫీడర్ సర్వీసులు

నగరంలోని పలు మెట్రో స్టేషన్ల నుంచి సెవెన్ సీటర్ ఫీడర్ సర్వీసులను ప్రయాణికులు వినియోగిస్తున్నారు. ముఖ్యమైన రూట్లు ఇలా ఉన్నాయి:

మియాపూర్ మెట్రో స్టేషన్

మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి కింది ప్రాంతాలకు ఫీడర్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి:

లింగంపల్లి

బాచుపల్లి క్రాస్‌రోడ్స్

బీరంగూడ

బెల్లా ఆర్సీపురం బస్‌స్టాప్

గంగారం

డీసీబీ బ్యాంక్ ప్రాంతం

ఎల్బీనగర్ మెట్రో స్టేషన్

ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, గణేష్ టెంపుల్, బీఎన్ రెడ్డి నగర్ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఫీడర్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

నాగోల్ మెట్రో స్టేషన్

నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి కింది ప్రాంతాలకు కనెక్టివిటీ ఉన్నట్లు అధికారులు తెలిపారు:

ఎల్బీనగర్

కుషాయిగూడ

హౌసింగ్ బోర్డ్

సఫిల్‌గూడ

మల్కాజ్‌గిరి

నేరెడ్‌మెట్

ఆనంద్‌బాగ్

మెట్టుగూడ మెట్రో స్టేషన్

మెట్టుగూడ మెట్రో స్టేషన్ నుంచి ఈస్ట్ ఆనంద్‌బాగ్ బస్‌స్టాప్ వరకు లాస్ట్ మైల్ కనెక్టివిటీని ఏర్పాటు చేశారు.

పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్

పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ నుంచి రాధిక ఎక్స్‌రోడ్, నేరెడ్‌మెట్ ఎక్స్‌రోడ్ ప్రాంతాలకు ఫీడర్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

రాయదుర్గ మెట్రో స్టేషన్ నుంచి ఐటీ ప్రాంతాలకు సేవలు

రాయదుర్గ మెట్రో స్టేషన్ నుంచి ఐటీ కారిడార్‌లోని పలు ప్రాంతాలకు యాప్ ఆధారిత సంస్థల సేవలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కింది ప్రాంతాలకు ప్రయాణికులు ఈ కనెక్టివిటీని వినియోగించుకోవచ్చు:

ఆర్ఎంజెడ్ నెక్ట్ ఐటీ పార్క్

వేవ్‌రాక్

టీసీఎస్

సినర్జీ పార్క్

టెక్ మహీంద్రా

అలాగే టీజీఎస్‌ఆర్టీసీ ఫీడర్ బస్సులు రాయదుర్గ మెట్రో స్టేషన్ నుంచి జీఆర్డీఎల్ఎఫ్, వేవ్‌రాక్, యూఎస్ కాన్సులేట్ ప్రాంతాల వరకు అందుబాటులో ఉన్నట్లు మెట్రో యాజమాన్యం తెలిపింది.

ప్రతిరోజూ లక్షలాది ప్రయాణికులకు ఉపయోగం

యాప్ ఆధారిత సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత లాస్ట్ మైల్ కనెక్టివిటీ ద్వారా ప్రతిరోజూ సుమారు 1.40 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్లు హెచ్ఎంఆర్ఎల్ పేర్కొంది.

ఈ సేవల వల్ల మెట్రో స్టేషన్‌ నుంచి ప్రయాణికులు తమ గమ్యస్థానానికి సులభంగా చేరుకోవచ్చు. దీంతో వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గడంతో పాటు నగరంలో రవాణా భారాన్ని కొంతవరకు తగ్గించేందుకు అవకాశం ఉంటుంది.

మిగిలిన స్టేషన్లకు కూడా విస్తరణ

ఇప్పటికే చాలా మెట్రో స్టేషన్లలో లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొచ్చామని హెచ్ఎంఆర్ఎల్ తెలిపింది. మిగిలిన మెట్రో స్టేషన్లలో కూడా వీలైనంత త్వరగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొంది.

మెట్రో ప్రయాణాన్ని కేవలం స్టేషన్‌ వరకు పరిమితం చేయకుండా, ప్రయాణికులు తమ ఇంటి దగ్గర నుంచి గమ్యస్థానం వరకు సులభంగా చేరుకునేలా ఈ ఫీడర్ సర్వీసులు ఉపయోగపడనున్నాయి.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »