హైదరాబాద్ నగరంలోని ఆహార ప్రియులకు షాక్ కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ రెస్టారెంట్ చైన్‌గా గుర్తింపు పొందిన ప్యారడైజ్ హోటల్‌లో వాడుతున్న నెయ్యి కల్తీ అయ్యి ఉండొచ్చన్న అనుమానాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత నెల రోజుల్లో నగరంలో కల్తీ నెయ్యికి సంబంధించి ఇది మూడో ఘటన కావడం గమనార్హం.మార్కెట్‌లో నెయ్యికి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని సంస్థలు రసాయనాలు, తక్కువ ధర కూరగాయ నూనెలతో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నాయన్న ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సాధారణ తనిఖీల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ అధికారులు ఖైరతాబాద్ జోన్‌లోని ఐమాక్స్ సమీపంలో ఉన్న ప్యారడైజ్ హోటల్‌తో పాటు మరో రెండు కేంద్రాల్లో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు.
అన్ సేఫ్ అని తేలిందా..
తనిఖీల సందర్భంగా హోటల్‌లో వినియోగిస్తున్న ‘సుధీర్ ఇండస్ట్రీస్’ బ్రాండ్‌కు చెందిన నెయ్యి నమూనాలను అధికారులు సేకరించారు. ఆ నమూనాలను నాచారంలోని రాష్ట్ర ఆహార భద్రత ప్రయోగశాలకు పంపించారు. అక్కడ నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో ఆ నెయ్యి తినడానికి సురక్షితం కాదని (అన్‌సేఫ్) తేలినట్లు సమాచారం. దీంతో నగర వ్యాప్తంగా కల్తీ ఆహార పదార్థాలపై మళ్లీ చర్చ మొదలైంది.
అయితే ప్రభుత్వ ప్రయోగశాల నివేదికను నెయ్యి తయారీ సంస్థ సవాలు చేసింది. పరీక్షల విధానం, ఫలితాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన సంస్థ, నమూనాలను మరోసారి పరీక్షించాలని కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు.
మైసూర్‌లోని కేంద్ర ప్రభుత్వ ప్రయోగశాలకి..
నమూనాలను మరింత ఖచ్చితమైన విశ్లేషణ కోసం మైసూర్‌లోని కేంద్ర ప్రభుత్వ ప్రయోగశాలకు పంపినట్లు అధికారులు తెలిపారు. అక్కడి నివేదికలో కూడా నెయ్యి కల్తీగా, ఆరోగ్యానికి హానికరమని తేలితే తయారీ సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం మైసూర్ ల్యాబ్ నుంచి తుది నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. ఈ ఘటనతో నగరంలో ఆహార భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతుండగా, వినియోగదారులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్న ఆహార పదార్థాలనే వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.


