హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం గ్రీన్‌సిటీ కాలనీలో చోటుచేసుకున్న గర్భిణి హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. నాలుగు నెలల గర్భిణిగా ఉన్న సునీతను ఆమె మాజీ భర్త దేవరకొండ మహేష్ అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. వివరాలలోకి వెళితే పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన మహేష్‌కు మహారాష్ట్రలోని తిలక్‌వాడ్ ప్రాంతానికి చెందిన సునీతతో 2022లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లి అనంతరం ఈ దంపతులు కెనడాకు వెళ్లారు. అయితే ఎనిమిది నెలల్లోనే వారి మధ్య విభేదాలు తలెత్తాయి.
సునీత భారత్‌కు వచ్చి మహారాష్ట్రలో కేసు నమోదు చేయడంతో మహేష్ అరెస్టు అయ్యాడు. అనంతరం 2024లో ఇద్దరూ చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. తర్వాత సునీత హైదరాబాద్‌కు వచ్చి సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరి, శ్రీనాథ్ అనే యువకుడిని ప్రేమించి 2025లో రెండో వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భిణి.
కక్షతో పన్నిన పథకం
ఇటీవల తన తల్లి మరణం తర్వాత కెనడాకు వెళ్లేందుకు మహేష్ ప్రయత్నించినప్పటికీ, పాత కేసుల కారణంగా వీసా రాలేదు. ఇదే సమయంలో సునీత మరో వివాహం చేసుకుని సంతోషంగా జీవించడం అతడు జీర్ణించుకోలేకపోయినట్లు పోలీసులు తెలిపారు.
సునీతను హత్య చేయాలని నిర్ణయించుకున్న మహేష్ నెల రోజులుగా తుర్కయంజాల్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ ఆమెపై నిఘా పెట్టాడు. ఆన్‌లైన్‌లో కత్తి, రంపం వంటి ఆయుధాలు కొనుగోలు చేసి ప్లాన్ ప్రకారం దాడికి సిద్ధమయ్యాడు.
ఇంట్లోకి చొరబడి దారుణం
సునీత భర్త బయటకు వెళ్లిన సమయాన్ని గమనించిన మహేష్, లిఫ్ట్ కాకుండా మెట్ల మార్గం ద్వారా అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నాడు. తలుపు తీయగానే సునీతను గదిలోకి లాక్కెళ్లి గొడవపడి, వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుకోసి హతమార్చాడు.
సునీత కేకలు విని అత్త అక్కడికి చేరుకోగా, ఆమె రక్తపు మడుగులో పడి కనిపించింది. భయంతో వణికిపోయిన అత్త పక్కింటివారికి సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ఆత్మహత్యాయత్నం… పోలీసుల అదుపులో నిందితుడు
గదిలోనే తలుపు వేసుకుని ఉన్న మహేష్, తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను తనపై పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు చాకచక్యంగా అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ కేసులో ముందస్తు ప్రణాళిక స్పష్టంగా కనిపిస్తున్నదని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. గర్భిణి హత్యకు గురైన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం రేపుతోంది.