మూసీ ప్రక్షాళనపై ఉద్రిక్తత.. భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజల ఆందోళన

మూసీ సుందరీకరణ పేరుతో భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా పరీవాహక ప్రాంతాల ప్రజలు హక్కులు కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు డీపీఆర్ వివరాలు వెల్లడించాలంటూ పర్యావరణవేత్తలు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Residents protesting against Musi River land acquisition
  • మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్‌పై ప్రజల ఆందోళన

  • డీపీఆర్, బఫర్ జోన్ మ్యాపుల వెల్లడికి డిమాండ్

  • భూసేకరణకు ముందు ప్రజాభిప్రాయం కోరుతున్న మూసీ బాధితులు

  • భూసేకరణపై పెరుగుతున్న అనుమానాలు

మూసీ నది సుందరీకరణ ప్రాజెక్ట్ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టే భూసేకరణపై పరీవాహక ప్రాంతాల ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. డీపీఆర్ సిద్ధంగా ఉందని చెబుతున్నప్పటికీ నది హద్దులు, బఫర్ జోన్ మ్యాపులను వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

స్థానికులు మాట్లాడుతూ ప్రజాభిప్రాయం తీసుకోకుండా భూములను స్వాధీనం చేసుకోవడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ఒక మాస్టర్ ప్లాన్‌కైనా ప్రజలతో చర్చ జరపలేదని ఆరోపిస్తున్నారు.

పనుల కంటే భూములపైనే దృష్టి?

ఎగువ ప్రాంతాల్లో పనులు ప్రారంభం కాకముందే నగర పరిధిలో భూసేకరణ చేపట్టడంపై ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఏ దశలో ఉందో వెల్లడించకుండా టీడీఆర్ బాండ్ల జారీకి సిద్ధమవడాన్ని వ్యతిరేకిస్తున్నారు.

Also Read: మున్సిపల్ ఫలితాలతో రేవంత్‌కు మరింత బలం.. కాంగ్రెస్ నెక్ట్స్ జనరేషన్ లీడర్స్‌లో టాప్

పర్యావరణవేత్తలు జీవో 921పై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రాజెక్ట్‌కు పూర్తి డీపీఆర్ లేకుండానే భాగాలుగా చూపిస్తూ ముందుకు సాగుతున్నారని విమర్శిస్తున్నారు.

‘మూసీ జన్ ఆందోళన్’ ఏర్పాటు

పరీవాహక ప్రాంతాల ప్రజల హక్కులను కాపాడేందుకు ‘మూసీ జన్ ఆందోళన్’ పేరిట సంఘం ఏర్పాటు చేశారు. తమ ఇళ్లను బఫర్ జోన్ పేరుతో ఖాళీ చేయించాలని చూస్తున్నారని, అదే ప్రదేశాల్లో పెద్ద నిర్మాణాలు వస్తే అవి ప్రమాదంలో ఉండవా అని ప్రశ్నిస్తున్నారు.

“ఇల్లు అనేది జీవితకాల కల. దాన్ని కూల్చేస్తామని చెప్పడం బాధాకరం” అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లోన్‌పై స్పష్టత లేకపోవడంపై ప్రశ్నలు

ప్రభుత్వం ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి రుణం వచ్చిందని చెబుతుండగా, అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదని తమకు సమాచారం అందిందని స్థానికులు చెబుతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రతిపాదన పరిశీలనలో ఉందని మాత్రమే తెలిసిందని పేర్కొన్నారు.

ఆందోళనలకు సిద్ధం

అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని, తమ హక్కుల కోసం పోరాడతామని బాధితులు హెచ్చరిస్తున్నారు. ప్రజలతో చర్చించి పారదర్శకంగా ప్రాజెక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »