హైదరాబాద్ :
హైదరాబాద్ పట్టణాభివృద్ధిలో సంచలన మార్పులకు నాంది పలుకుతూ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం స్టేట్ సెక్రటేరియట్‌లో MAUD విభాగంతో కీలక సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని మూడు కార్పొరేషన్లకు వర్తించే కోర్ అర్బన్ యాక్ట్ తయారు చేయాలని అధికారులకు తాజా ఆదేశాలు ఇచ్చారు. అనుమతులు, ఫీజులు, అభివృద్ధి పనుల నిర్వహణ అన్నింటికీ ఈ కొత్త చట్టమే ఆధారంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పట్టణ పరిధిలో పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆదేశించారు.
పారిశుధ్యం, రోడ్లపై కీలక నిర్ణయాలు
కోర్ అర్బన్ ఏరియాలో పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజలు చెత్తపోయడానికి నిర్దిష్ట ప్రదేశాలు లేక బహిరంగ స్థలాల్లో పారవేస్తున్నారని గుర్తించిన సీఎం ముందు సరైన చెత్త డంపింగ్ స్థలాలు గుర్తించి బోర్డులు పెట్టాలని, ఆ తర్వాత నిర్దేశిత ప్రదేశాల వెలుపల చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్ల నిర్మాణంలో ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకంలో వినియోగించే సాంకేతికత మాదిరిగా రోడ్ నిర్మించిన తర్వాత నిర్దిష్ట కాలానికి ముందే తీసివేస్తే బాధ్యులను గుర్తించాలని ఆదేశించారు. ప్రతి వీధి దీపం డ్యాష్‌బోర్డ్‌లో కనిపించేలా చేసి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కూడా ఆదేశించారు.
హోటళ్లలో CC కెమెరాలు, అగ్ని భద్రత
కోర్ అర్బన్ ఏరియాలోని అన్ని హోటళ్ల వంటగదుల్లో CC కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలని సీఎం ఆదేశించారు. ఆహార భద్రత చర్యల ఆధారంగా హోటళ్లకు రేటింగ్ ఇవ్వాలని సూచించారు. 50 అంతస్తులకు పైగా భవనాలు నిర్మిస్తున్న నేపథ్యంలో అంత ఎత్తున అగ్నిప్రమాదాలను అదుపు చేసేందుకు అధునాతన పరికరాలు సేకరించాలని కూడా ఆదేశించారు. నగరంలోని సర్కిళ్ల వద్ద వర్షపు నీరు సేకరించడానికి హార్వెస్టింగ్ బావులు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు.
భవిష్యత్ సిటీ, చెరువుల అభివృద్ధి
భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయ భవనాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని, నిర్మాణ నాణ్యత పాటించాలని సీఎం ఆదేశించారు. HYDRAA పరిరక్షణలో ఉన్న చెరువులు కేవలం కట్టలు నిర్మించి వదిలేయకుండా వాటిని పర్యాటక ఆకర్షణలుగా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. R&B సహా వివిధ శాఖల ఆధీనంలో ఉన్న కోర్ అర్బన్ ఏరియా రోడ్లన్నింటినీ MAUD పరిధిలోకి తీసుకువచ్చి సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణ రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, HYDRAA కమిషనర్ రంగనాథ్, GHMC కమిషనర్ కర్ణన్ తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఇంకా చదవండి: