హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో కలకలం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సునీత హత్య కేసులో పోలీసులు విస్తుపోయే వివరాలను బయటపెట్టారు. ఇది క్షణికావేశంలో జరిగిన ఘటన కాదని, మాజీ భర్త మహేశ్ రెండు నెలలపాటు పక్కా ప్రణాళికతో అమలు చేసిన ఘోర చర్య అని దర్యాప్తులో తేలింది. పోలీసుల సమాచారం ప్రకారం, మహేశ్ కెనడాలో ఉద్యోగం కోల్పోయాడు. సునీత పెట్టిన కేసుల కారణంగా తిరిగి కెనడాకు వెళ్లే అవకాశాలు లేకపోవడంతో ఆమెపై తీవ్ర కక్ష పెంచుకున్నాడు. ఈ కక్షే హత్యకు దారి తీసిందని విచారణలో వెల్లడైంది.
సునీత ఆచూకీ తెలుసుకోవడానికి ఆమె సోషల్ మీడియా ఖాతాలను గమనిస్తూ వచ్చాడు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన రీల్స్‌ను నిశితంగా పరిశీలించాడు. వీడియోల బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించిన భవనాలు, పరిసర ప్రాంతాల ఆధారంగా ఆమె నివాసాన్ని గుర్తించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాప్రాయి చెరువు సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో ఆమె ఉంటున్నట్లు నిర్ధారించుకున్నాడు.
Also Read: ఆపరేషన్ టేబుల్‌పై పాట.. మెదడు ట్యూమర్ తొలగింపు మధ్య ఆశ్చర్య ఘటన
యుద్ధానికి సిద్ధమైనట్లే సన్నాహాలు
హత్యకు ముందు మహేశ్ చేసిన ఏర్పాట్లు పోలీసులను సైతం షాక్‌కు గురిచేశాయి. తలుపులు వేసుకుని ఉంటే కోసేందుకు గ్రైండర్ కట్టర్, ప్రతిఘటించకుండా కళ్లలో కొట్టేందుకు పెప్పర్ స్ప్రే, దాడి చేసేందుకు పదునైన కత్తులు వెంట తెచ్చుకున్నాడు. హత్య అనంతరం తనపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవాలన్న యోచన కూడా ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.
సుమారు 60 రోజులపాటు తుర్కయాంజిల్ ప్రాంతంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ, నాలుగు రోజులపాటు సునీత కదలికలపై రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. వాచ్‌మన్ లేని సమయాన్ని గమనించి అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
పశ్చాత్తాపం లేదన్న నిందితుడు
తాను చేసిన నేరానికి ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ఏ శిక్షకైనా సిద్ధమని మహేశ్ పోలీసుల ఎదుట చెప్పినట్లు సమాచారం. మాజీ భార్యపై పెంచుకున్న కక్షతోనే ఈ హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
ఫిర్యాదుతో కేసు నమోదు
సునీత రెండో భర్త శ్రీనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మహేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటన వ్యక్తిగత విభేదాలు ఎంతటి విషాదాలకు దారి తీస్తాయో మరోసారి స్పష్టం చేసింది. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత వివరాలు బయటపడటం కూడా భద్రతాపరమైన ప్రమాదాలకు కారణమవుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


