టాటా గ్రూప్‌నకు చెందిన ఎలక్ట్రానిక్స్ రిటైలర్ క్రోమా, అంతర్జాతీయ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ కెర్నీతో కలిసి హౌ ఇండియా అప్‌గ్రేడ్స్ అనే నివేదికను విడుదల చేసింది. ముంబైలోని జుహులో క్రోమా మొదటి స్టోర్ ప్రారంభించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నివేదికను తీసుకువచ్చారు. దీని ప్రకారం 2024లో రూ.7 లక్షల కోట్లుగా ఉన్న భారత ఎలక్ట్రానిక్స్ మార్కెట్ 2030 నాటికి సుమారు రూ.10 లక్షల కోట్లకు చేరుకోనుంది.
చిన్న నగరాల వృద్ధి..
2022 నుండి 2025 మధ్య కాలంలో క్రోమా అమ్మకాలలో టైర్ 3 నగరాల్లో 40 శాతం, టైర్ 2 నగరాల్లో 30 శాతం, టైర్ 1 నగరాల్లో 35 శాతం , మెట్రో నగరాల్లో 13 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. నాన్-మెట్రో మార్కెట్ల వాటా 2022లో 32 శాతం నుండి 2025 నాటికి 44 శాతానికి పెరిగింది. అలాగే 2021 నుండి 2025 మధ్య స్మార్ట్‌ఫోన్‌ల సగటు ధర 34 శాతం పెరిగింది, రూ.50,000 పైబడిన ఫోన్‌ల విలువ 26 శాతం వృద్ధి చెందింది. ఏసీ విభాగంలో ఇన్వర్టర్ ఏసీల వాటా 2015లో 9 శాతం నుండి 2025 నాటికి 91 శాతానికి చేరగా, 55 అంగుళాలు లేదా అంతకంటే పెద్ద టీవీల అమ్మకాలు 2015లో ప్రతి 25 టీవీలలో ఒకటిగా ఉండగా, 2025 నాటికి ప్రతి మూడు టీవీలలో ఒకటిగా మారాయి.
సంస్థల ప్రతినిధుల స్పందన..
2021 నుండి 2025 మధ్య డిష్‌వాషర్లు, డ్రయ్యర్ల విక్రయాలు 29 శాతం, గేమింగ్ పరికరాలు 26 శాతం, హియరబుల్స్ 23 శాతం, ఎయిర్ ఫ్రయ్యర్లు 22 శాతం వృద్ధి నమోదు చేశాయి. పరికరాలను అప్‌గ్రేడ్ చేసుకోవడం, కొత్త విభాగాలు , చిన్న నగరాల విస్తరణ ద్వారా అదనపు రూ.3 లక్షల కోట్ల అవకాశం ఏర్పడుతుందని నివేదిక తెలిపింది. వినియోగదారులు నమ్మకంగా పరికరాలను అప్‌గ్రేడ్ చేసుకునేలా సరైన ఉత్పత్తులు, సలహాలు, సులభమైన చెల్లింపులు, విక్రయానంతర సేవలు అందిస్తున్నామని క్రోమా సీఈఓ , ఎండీ శిబాశిష్ రాయ్ తెలిపారు. సాంకేతికత ద్వారా జీవితాలను ఎలా అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారనే దానిపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని కెర్నీ ఇండియా చైర్మన్ కౌశిక మాధవన్ పేర్కొన్నారు.