బతుకమ్మలో 9 రోజులు.. ఒక్కో రోజుకు ఒక్కో పేరు, నైవేద్యం వెనుక అసలు కథ ఇదే!

ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో ఒక్కో రోజుకు ఎందుకు ప్రత్యేకమైన పేరు వచ్చింది? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పిస్తారు, ఆ పేర్ల వెనుక ఉన్న విశేషాలు ఏంటో తెలుసుకోండి.

Bathukamma festival
Bathukamma festival

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజుల్లో బతుకమ్మను ఒక్కో పేరుతో పిలుస్తారు. అంతేకాదు.. ప్రతి రోజూ ప్రత్యేకమైన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ పండుగ.. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఒక్కో రోజుకు ఎందుకు ఆ పేరు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటి రోజు.. ఎంగిలి పూల బతుకమ్మ

మొదటి రోజు అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. దీనిని మహాలయ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున పెద్దలకు, చనిపోయిన వారికి రుణాలు తీర్చుకోవడం కోసం అన్నప్రసాదాలు పెడతారు. తెలంగాణలో దీనిని పితృ అమావాస్యగా కూడా పిలుస్తారు.

పెద్దలందరికీ భోజనాలు పెట్టిన తర్వాత అమ్మవారిని కొలవడం ప్రారంభిస్తారు. బతుకమ్మను తయారు చేసి పాటలు పాడుతూ అమ్మకు నువ్వుల పిండి, బియ్యం అన్నం ప్రసాదంగా పెడతారు. అందువల్ల మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు.

రెండో రోజు.. అటుకుల బతుకమ్మ

రెండో రోజు అటుకుల బతుకమ్మ జరుపుకుంటారు. ఈ రోజున అటుకులను ప్రసాదంగా అమ్మవారికి సమర్పిస్తారు. బతుకమ్మ అలంకరణలో పెద్దగా మార్పు ఉండదు. తొమ్మిది పూలతో బతుకమ్మను తయారు చేసి, పైన గౌరీ మాతను పసుపు ముద్దగా పెడతారు.

మూడో రోజు.. ముద్దపప్పు బతుకమ్మ

మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ లేదా ముద్ద పువ్వు బతుకమ్మ అంటారు. ఈ రోజున ముద్దపప్పును ప్రసాదంగా అమ్మవారికి సమర్పిస్తారు.

అలాగే ఈ రోజు బతుకమ్మ అలంకరణలో ముద్ద బంతులు, ముద్ద చామంతులు ఎక్కువగా ఉపయోగిస్తారు. అందువల్ల దీనిని ముద్ద పువ్వు బతుకమ్మ అని కూడా పిలుస్తారు.

నాలుగో రోజు.. నానే బియ్యం బతుకమ్మ

నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ జరుపుకుంటారు. ఈ రోజున బియ్యాన్ని నానబెట్టి, దానితో ఉండలు తయారు చేసి ప్రసాదంగా అమ్మవారికి సమర్పిస్తారు.

బతుకమ్మ చుట్టూ తిరుగుతూ మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ అమ్మవారిని కొలుస్తారు.

ఐదో రోజు.. అట్ల బతుకమ్మ

ఐదో రోజు అట్ల బతుకమ్మ. ఈ రోజున దోసలు, అట్లు ప్రసాదంగా అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడి అమ్మవారిని ప్రార్థిస్తారు.

ఆరవ రోజు.. అలక బతుకమ్మ

ఆరవ రోజు బతుకమ్మను అలక బతుకమ్మ అంటారు. గౌరమ్మ ఈ రోజున కొంత దుఃఖంలో ఉంటారని భక్తుల నమ్మకం. శివుడి గురించి, భర్త గురించి ఆలోచించుకుంటూ అమ్మవారు బాధలో ఉంటారని భావిస్తారు.

అందువల్ల ఈ రోజున అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యాలు పెట్టకుండా, ఆమెను ఆలోచనలో ఉండనిస్తారని చెబుతారు. అందుకే దీనిని అలిగిన బతుకమ్మ లేదా అలక బతుకమ్మ అంటారు.

ఏడో రోజు.. వేపకాయ బతుకమ్మ

ఏడో రోజు వేపకాయ బతుకమ్మ జరుపుకుంటారు. ఈ రోజున బియ్యం పిండితో వేపకాయల ఆకారంలో ముద్దలు తయారు చేసి అమ్మవారికి ప్రసాదంగా సమర్పిస్తారు. అందుకే ఈ బతుకమ్మను వేపకాయ బతుకమ్మ అంటారు.

ఎనిమిదో రోజు.. వెన్నముద్దల బతుకమ్మ

ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ. ఈ రోజున వెన్న, నెయ్యి, బెల్లం, పాలు, బియ్యం కలిపి వెన్నముద్దలు తయారు చేసి అమ్మవారికి ప్రసాదంగా పెడతారు. అనంతరం అమ్మవారిని ప్రార్థిస్తారు.

తొమ్మిదో రోజు.. సద్దుల బతుకమ్మ

తొమ్మిదో రోజు బతుకమ్మ పండుగలో చాలా ముఖ్యమైన రోజు. దీనిని సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ అంటారు.

ఈ రోజున బతుకమ్మ పరిమాణాన్ని పెంచి, ఎక్కువ పూలను ఉపయోగించి పెద్దగా తయారు చేస్తారు. అందువల్ల దీనిని పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు.

సద్దుల బతుకమ్మకు ముందు రోజు రాత్రే తెలంగాణ మహిళలు ఐదు రకాల ప్రసాదాలను తయారు చేస్తారు. పెరుగు అన్నం, నువ్వుల అన్నం, కొబ్బరి అన్నం, చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార వంటి ప్రసాదాలను తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

ఈ ప్రసాదాలను సద్దిగా, సద్ది కూడుగా, సద్దులుగా అమ్మవారికి సమర్పిస్తారు. అందుకే తొమ్మిదో రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగలో ఇలా ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన పేరు, ప్రత్యేకమైన నైవేద్యం, ప్రత్యేకమైన ఆచారం ఉండటం విశేషం.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »