దక్షిణ భారతదేశంలోని ఇళ్లలో ఉదయం అల్పాహారం సమయంలో పాలు, పెరుగు లేదా ఫిల్టర్ కాఫీ కనిపించడం సర్వసాధారణం. దక్షిణాదిలో పాడి ఉత్పత్తులు కేవలం ఒక పోకడ లేదా అదనపు ఆహారం కాదు, ప్రజల రోజువారీ జీవనశైలిలో విడదీయలేని భాగంగా నిలిచాయి. జాతీయ పాల దినోత్సవం సందర్భంగా దక్షిణాది రోజువారీ పోషకాహారంలో పాడి ఉత్పత్తుల ప్రాధాన్యతను చాటే ఐదు ముఖ్య విషయాలను గోద్రెజ్ జెర్సీ మార్కెటింగ్ విభాగాధిపతి శంతను రాజ్ వివరించారు.
తెలంగాణలో పాల ఉత్పత్తి వృద్ధి అంచనాలు..
తెలంగాణలో 2024-25లో 59.35 లక్షల టన్నుల పాలు ఉత్పత్తి కాగా, 2025-26లో ఇది సుమారు 4 శాతం పెరిగి 61.75 లక్షల టన్నులకు చేరుకుంటుందని అంచనా వేశారు. 2023-24లో రాష్ట్రంలో రోజుకు తలసరి పాల లభ్యత 419 గ్రాములుగా ఉండి, జాతీయ సగటు 471 గ్రాముల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. రైతుల నుండి ప్రాసెసింగ్, విక్రయాల వరకు పాడి రంగాన్ని ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. స్థానికంగా నిరంతర ఉత్పత్తి పెరిగితే కుటుంబాలకు అందుబాటు ధరల్లో పౌష్టికాహారం లభిస్తుంది.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో అధిక పాల లభ్యత..
జాతీయ పాడి అభివృద్ధి మండలి 2023-24 గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు తలసరి పాల లభ్యత 719 గ్రాములుగా ఉంది. ఇది జాతీయ సగటు 471 గ్రాములతో పోలిస్తే సుమారు ఒకటిన్నర రెట్లు అధికం, కాగా 2022-23లో ఉన్న 799 గ్రాములతో పోలిస్తే కొద్దిగా తగ్గింది. పాలు పుష్కలంగా లభించడం వల్ల టీ, టిఫిన్లు, పెరుగన్నం, మజ్జిగ, తీపి వంటకాల రూపంలో కుటుంబాలకు ప్రోటీన్ సులభంగా అందుతోంది. అదేవిధంగా కర్ణాటకలో రోజుకు తలసరి పాల లభ్యత 543 గ్రాములుగా నమోదై, జాతీయ సగటును మించింది. దీని ద్వారా దక్షిణాదిలో పాడి రంగ బలం ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదని స్పష్టమవుతోంది.
రోజూ పాలు లేదా పెరుగు తీసుకునే అలవాటు..
లభ్యతతో పాటు వినియోగం కూడా కీలకం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదో దశ 2019-21 నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్ , కర్ణాటకలో ప్రతి నలుగురు పెద్దలలో సుమారు ముగ్గురు రోజూ పాలు లేదా పెరుగు తీసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో రోజువారీ వినియోగం 48.8 శాతంగా ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో పురుషులలో 77.1 శాతం, మహిళలలో 74.8 శాతం మంది రోజూ పాలు లేదా పెరుగు సేవిస్తున్నారు. కర్ణాటకలో ఇది పురుషులలో 76.2 శాతం, మహిళలలో 77.9 శాతంగా ఉంది. అల్పాహారంలో పాలు, భోజనంలో పెరుగు, సాయంత్రం వేళ పాడి ఆధారిత చిరుతిళ్లు దక్షిణాది ఇళ్లలో సహజ అలవాటుగా మారాయి.
సంపూర్ణ ప్రోటీన్గా పాడి ఉత్పత్తులు, రోజువారీ ఆహారంలో పాత్ర..
పాలు, పెరుగు , పనీర్‌లో శరీరానికి అవసరమైన తొమ్మిది అత్యవసర అమైనో ఆమ్లాలు లభిస్తాయి. శరీరం స్వయంగా తయారు చేసుకోలేని వీటిని ఆహారం ద్వారానే పొందాలి. మొక్కల ఆధారిత ఆహారాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అమైనో ఆమ్లాలు తక్కువగా ఉండటంతో రోజువారీ ఆహారంలో వాటిని కలిపి తీసుకోవాల్సి వస్తుంది. కానీ పాడి ఉత్పత్తులు సరళమైన రూపాల్లోనే సంపూర్ణ ప్రోటీన్‌ను అందిస్తాయి. అధిక ఉత్పత్తి, విస్తృత లభ్యత, నిత్య వినియోగం, సంపూర్ణ పోషక విలువలు కలిసి పాలు, పెరుగు, పనీర్లను దక్షిణాది నిత్యజీవిత ప్రోటీన్గా నిలబెడుతున్నాయి. రైతుల నుండి చిల్లర వర్తకుల వరకు అందరూ నాణ్యతను నిలబెట్టడం బాధ్యతగా, అవకాశంగా తీసుకోవాలి.