పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తుండగా, ఇరాన్ కూడా ప్రతిస్పందనగా ఆయా దేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులను పెంచుతోంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలోని చమురు ఉత్పత్తి దేశాలపై కూడా దాడులు జరుగుతుండటంతో అంతర్జాతీయ ఇంధన సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే సమయంలో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలను ఈ మార్గం గుండా ప్రయాణించనివ్వబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే ఇతర దేశాలకు చెందిన అంతర్జాతీయ నౌకల రాకపోకలకు మాత్రం మార్గం తెరిచే ఉంటుందని తెలిపింది.
హర్మూజ్ జలసంధిని దాటిన నౌకలు
పశ్చిమాసియాలో అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ చేపడుతున్న దాడులకు నిరసనగా ఈ ఆంక్షలు విధించినట్లు ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో తమ దేశ భద్రతకు ప్రమాదం ఏర్పడితే హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేసే అధికారం తమకు ఉందని ఇరాన్ గతంలోనే హెచ్చరించింది.
Also Read: ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ధర పెంపు.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు అమలు
ఈ పరిణామాల మధ్య భారత్‌కు చెందిన రెండు కీలక ఎల్‌పీజీ రవాణా నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్లు సమాచారం. భారత ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన చమురు దిగుమతుల కోసం వినియోగించే ‘సిగ్మా గ్యాస్’ (Sigma Gas), ‘ఎపిక్ బెర్ముడా’ (Epic Bermuda) అనే భారీ ఎల్‌పీజీ క్యారియర్లు ఈ మార్గం గుండా ప్రయాణించి పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి భారత్‌కు వంటగ్యాస్‌ను తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదం కూడా పొంచి ఉంది..
ప్రస్తుతం ఈ ప్రాంతంలో డ్రోన్ దాడులు, నౌకల హైజాకింగ్ వంటి ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నౌకలు సురక్షితంగా ప్రయాణించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ రవాణాలో దాదాపు 20 నుంచి 30 శాతం వరకు ఈ చిన్న జలసంధి ద్వారానే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
హర్మూజ్ జలసంధి ఇరాన్ మరియు ఓమన్ దేశాల మధ్య ఉంది. ప్రపంచ ఇంధన సరఫరాకు ఇది అత్యంత కీలకమైన మార్గం. ఈ ప్రాంతంలో ఏదైనా అంతరాయం కలిగితే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంటుంది.
ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచ దేశాలు..
అదనంగా ఈ ప్రాంతంలో యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటు దారుల దాడులు కూడా తరచూ జరుగుతుంటాయి. అందుకే అంతర్జాతీయ ఇంధన నౌకల భద్రత కోసం భారత నౌకాదళం పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లో యుద్ధ నౌకలను మోహరించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తోంది.
ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో హర్మూజ్ జలసంధి పరిస్థితిపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మార్గంలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై పెద్ద ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.