యుద్ధం దెబ్బతో కుదేలైన‌ ఇరాన్ ఆర్థిక వ్యవస్థ … ధరల పెరుగుదలతో విల‌విల్లాడుతున్న‌ ప్రజలు

ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చింది. నిత్యావసరాల ధరలు అమాంతం పెరగడంతో సామాన్య ప్రజల జీవనం సంక్షోభంలోకి జారింది.

Iran Economic Crisis 2026
Iran Economic Crisis 2026

ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి అత్యంత దారుణంగా మారుతోంది. యుద్ధ వ్యయాలు పెరుగుతుండటం, ఆదాయం తగ్గిపోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో యుద్ధం కొనసాగుతుండటంతో పరిస్థితి మరింత దిగజారుతోంది.

యుద్ధ ప్రభావం నేరుగా సామాన్య ప్రజలపై పడుతోంది. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంతో పోలిస్తే ఆహార పదార్థాల ధరలు సుమారు 112 శాతం పెరిగాయి. ముఖ్యంగా వంట నూనెల ధరలు 200 శాతం పైగా పెరగడం ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. అంతేకాకుండా, అంత్యక్రియల ఖర్చులు కూడా 40 శాతం పెరగడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది.

భారీగా ప‌డిపోయిన రియాల్ విలువ‌..

ఇరాన్ కరెన్సీ అయిన రియాల్ విలువ భారీగా పడిపోయింది. ఒక అమెరికన్ డాలర్‌కు సుమారు 16 లక్షల రియాల్స్ వరకు మారడం ఆర్థిక వ్యవస్థ పతనాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. దీంతో ప్రజలు దాచుకున్న సొమ్ము విలువ కోల్పోయి, రోజువారీ ఖర్చులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఉద్యోగ అవకాశాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినప్పటికీ, అసలు సంఖ్య 20 నుంచి 30 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలు ప్రస్తుతం ఎలాంటి ఆదాయ వనరులు లేకుండా జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం అందించే సహాయం, ఫుడ్ వోచర్లు కూడా సరిపోవడం లేదు.

వస్తువుల ధరల పెరుగుదల ఎంత తీవ్రమైందంటే… ఒక కోడిగుడ్డు ధర సుమారు 2 లక్షల రియాల్స్‌కు చేరుకుంది. ఇది గతంతో పోలిస్తే భారీ పెరుగుదల. ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోవడంతో చిన్న వ్యాపారాలు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి.

భారీ జ‌రిమానాలు..

ఇక దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలుగా భావించే పెట్రోకెమికల్, స్టీల్ రంగాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. టెహ్రాన్ స్టాక్ ఎక్స్చేంజ్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా ఎనిమిది వారాల పాటు మూతపడటం పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో సూచిస్తోంది.

ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వం పన్నులు తగ్గించకపోగా, లోన్ చెల్లింపులు ఆలస్యమైతే భారీ జరిమానాలు విధించడం ప్రజల ఆర్థిక భారం మరింత పెంచుతోంది. యుద్ధ ప్రభావం కారణంగా ఏర్పడిన ఈ ఆర్థిక సంక్షోభం నుంచి ఇరాన్ ఎప్పుడు బయటపడుతుందో అనేది అనిశ్చితంగా మారింది.
Also Read : మణికొండలో తాగునీటి పైప్‌లైన్ పేలి కాలనీల్లో వరద .. అపార్ట్‌మెంట్ సెల్లార్లు జలమయం

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »