మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలో జరిగిన ఒక వ్యాపారి హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మొదట ఇది దొంగల దాడిగా కనిపించినప్పటికీ, పోలీసులు చేపట్టిన విచారణలో ఈ కేసు వెనుక ఉన్న అసలు నేరగాళ్లు ఎవరో బయటపడటంతో అందరూ షాక్‌కు గురయ్యారు.
ఏప్రిల్ 7 రాత్రి 28 ఏళ్ల దేవకృష్ణ పురోహిత్ తన ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. పదునైన ఆయుధంతో అతనిపై దాడి జరగడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన సమయంలో ఇంట్లో ఉన్న అతని భార్య ప్రియాంక పురోహిత్ పోలీసులకు తాను బందీగా ఉన్నానని, గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి రూ.3.5 లక్షల విలువైన నగలు దోచుకెళ్లారని, అడ్డుకున్న తన భర్తను చంపేశారని కథ చెప్పింది.
ఇప్పటికీ అసలు విషయం బయటపడింది..
అయితే, పోలీసులు కేసును లోతుగా పరిశీలించగా అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా దేవకృష్ణ సోదరి జ్యోతి ఇచ్చిన సమాచారం కేసు మలుపు తిప్పింది. ప్రియాంక తన భర్తను రంగు పేరుతో అవమానించేదని, తరచూ వేధించేదని ఆమె వెల్లడించింది. అంతేకాకుండా 2020 నుంచే ప్రియాంకకు కమలేష్ పురోహిత్‌తో అక్రమ సంబంధం ఉందని తెలిసింది.
పోలీసుల దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, ప్రియాంక తన ప్రియుడు కమలేష్‌తో కలిసి భర్తను అడ్డుతొలగించుకోవాలని పథకం రచించింది. ఇందుకోసం సురేంద్ర భాటి అనే వ్యక్తిని రూ.1 లక్షకు సుపారీ ఇచ్చారు. ముందుగా రూ.50 వేలు అడ్వాన్స్‌గా చెల్లించినట్లు పోలీసులు తెలిపారు.
దొంగతనంలా చూపించేలా..
పథకం ప్రకారం హత్య జరిగిన రాత్రి ప్రియాంక కావాలనే ఇంటి తలుపులు తెరిచి ఉంచింది. దేవకృష్ణ నిద్రలో ఉండగా సురేంద్ర ఇంట్లోకి ప్రవేశించి అతనిపై దాడి చేశాడు. అనంతరం ఘటనను దొంగతనంలా చూపించేందుకు గదిని చిందరవందర చేసి నగలు మాయమైనట్టు నాటకం ఆడారు.
కానీ, పోలీసులు సోదాలు చేపట్టగా ప్రియాంక చెప్పినట్లు నగలు దొంగిలించబడలేదని, అవే ఇంట్లో దొరికాయి. అలాగే మొబైల్ డేటా ఆధారాలు కూడా ఈ కుట్రను బట్టబయలు చేశాయి. విచారణలో ప్రియాంక తన నేరాన్ని అంగీకరించగా, పోలీసులు ఆమెతో పాటు కమలేష్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సుపారీ కిల్లర్ సురేంద్ర కోసం గాలింపు కొనసాగుతోంది.
ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “నా కొడుకును చంపిన వారికి కఠిన శిక్ష పడాలి” అంటూ దేవకృష్ణ తల్లి కన్నీరుమున్నీరవుతోంది. ఈ హత్య ఘటన సమాజాన్ని కలవరపరుస్తోంది.
Also Read:


