హైదరాబాద్‌లో ఘోరం: యువతికి ఎయిడ్స్ రక్తం ఎక్కించి చంపిన ఉన్మాది

హైదరాబాద్ పోచారంలో రాంబాయి సినిమా తరహా ఘటన. పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్ఐవి రక్తం ఎక్కించిన మనోహర్. అవమానం భరించలేక యువతి ఆత్మహత్య. సెల్ఫీ వీడియో వైరల్.

Selfie video still of victim Ramani before suicide and Pocharam police station investigation images
Selfie video still of victim Ramani before suicide and Pocharam police station investigation images

మేడ్చల్: సినిమా కథను మించిన దారుణం హైదరాబాద్ పోచారంలో చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకోలేదన్న కోపంతో ఒక యువతికి హెచ్‌ఐవీ (HIV) రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించిన యువకుడి పైశాచికత్వం, ఆ యువతి ప్రాణం తీసింది. మనోహర్ అనే యువకుడి చేతిలో మోసపోయిన బాధితురాలు రమణి, సమాజంలో గౌరవం పోయిందని ఆవేదన చెందుతూ ఆత్మహత్యకు పాల్పడింది.

అసలేం జరిగింది? (ఘటన నేపథ్యం):

పోచారం ఐటీ కారిడార్ పరిధిలో నివసించే రమణికి, వరుసకు బావ అయ్యే మనోహర్‌తో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని వెంటపడటంతో రమణి మొదట నిరాకరించినా, తర్వాత అంగీకరించింది. అయితే, కానిస్టేబుల్ పరీక్షల సమయంలో మనోహర్‌కు మెడికల్ టెస్ట్ చేయగా అతనికి హెచ్‌ఐవీ పాజిటివ్ అని తేలింది. ఆ విషయం తెలిసినప్పటి నుండి రమణి అతనికి దూరంగా ఉండటం ప్రారంభించింది.

ప్రాణం తీసిన పైశాచికత్వం:

మనోహర్ తనను పెళ్లి చేసుకోవాలని రమణిపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. 2025లో వీరిద్దరికీ మళ్ళీ పరీక్షలు చేయించగా.. మనోహర్‌కు పాజిటివ్, రమణికి నెగిటివ్ అని వచ్చింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆ సంబంధాన్ని నిరాకరించి, ఫిబ్రవరిలో రమణికి మరో పెళ్లి సంబంధం ఖాయం చేశారు.

మార్చి 11న దాడి: తమ ప్రేమ విఫలమైందన్న కక్షతో, మార్చి 11న రమణి ఇంటికి వెళ్లిన మనోహర్, ఆమెకు బలవంతంగా ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాడు.

పోలీసుల చర్య: ఈ ఘటనపై అప్పట్లోనే కేసు నమోదు చేసిన పోచారం పోలీసులు మనోహర్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Also Read : Pocharam News : ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా తరహా ఘటన.. పెళ్లి నిరాకరించిందని ఎయిడ్స్ ఇంజెక్షన్!

సెల్ఫీ వీడియోలో బాధితురాలి ఆవేదన:

ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రమణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు ఆమె తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.

“నా జీవితాన్ని ఆగం చేశాడు.. గౌరవం లేకుండా నేను బ్రతకలేను. నన్ను నమ్మించి, ప్రేమించి ఇలా చేశాడు. కొంతమంది నాపై లేనిపోని ప్రచారాలు చేశారు. ఎయిడ్స్ ఇంజెక్షన్ చేసిన రోజే నా స్నేహితురాలికి ఫోన్ చేసి చెప్పాను. ఎలాగో చనిపోవాలన్న ఆలోచనతోనే ఆసుపత్రికి వెళ్ళలేదు.” అని ఆ వీడియోలో రమణి వాపోయింది.

 

మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు మనోహర్ జైలులో ఉండగా, రమణి మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »