జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపులకు అవకాశం లేకుండా పూర్తిగా డిజిటల్ పేమెంట్లకే ప్రాధాన్యం ఇవ్వనుంది. కొత్త నిర్ణయంతో ఇప్పుడు వినియోగదారులకి కాస్త ఇబ్బందులు తప్పవు.
జాతీయ రహదారులపై వాహనదారులకు పెద్ద మార్పు రాబోతోంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగి నగదు చెల్లించే రోజులు ఇక ముగియనున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాల ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల్లో క్యాష్ లైన్లు రద్దు కానున్నాయి. వాహనదారులు కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ పేమెంట్ల ద్వారానే టోల్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్: IIIT జంక్షన్ వద్ద మూడు భారీ ఫ్లైఓవర్ల నిర్మాణం.
హైవేలపై ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు, ప్రయాణాన్ని వేగవంతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం క్యాష్ పేమెంట్ల కారణంగా టోల్ గేట్ల వద్ద ఎక్కువ సమయం వృథా అవుతుండటం, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటం ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులను తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయించింది.
వాహనదారులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు :
ఫాస్టాగ్ ఉపయోగించే వారు తమ ఫాస్టాగ్ కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోవాలి.
ప్రయాణానికి ముందుగా వాలెట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం తప్పనిసరి
తగినంత బ్యాలెన్స్ లేకపోతే వెంటనే రీఛార్జ్ చేసుకోవాలి.
అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది రాకుండా యూపీఐ పేమెంట్ ఆప్షన్ కూడా సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.
ఫాస్టాగ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి?
మొబైల్‌లో MyFASTag యాప్ డౌన్‌లోడ్ చేసి లాగిన్ అయితే బ్యాలెన్స్ వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. లేదా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాలెట్‌కు మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటే, అదే నెంబర్ నుంచి 88843 33331 కి మిస్డ్ కాల్ ఇస్తే బ్యాలెన్స్ మెసేజ్ వస్తుంది.
మొత్తానికి ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు పూర్తిగా గుడ్‌బై చెప్పాల్సిందే. డిజిటల్ పేమెంట్లకు అలవాటు పడిన వాహనదారులకు ఇది సౌకర్యంగా మారనున్నప్పటికీ, ఇంకా క్యాష్‌పైనే ఆధారపడే వారికి మాత్రం ఇది కొత్త మార్పుగా నిలవనుంది.