పనామా బ్రిడ్జ్‌పై భారీ పేలుడు … కెనాల్ రవాణాపై ప్రభావం, ఆందోళ‌న చెందుతున్న అమెరికా

పనామా కెనాల్ ప్రవేశద్వారానికి సమీపంలో ఉన్న బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికాస్ వద్ద జరిగిన భారీ పేలుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఇంధన ట్యాంకర్లలో మంటలు చెలరేగి పేలుళ్లు సంభవించడంతో పలువురు గాయపడగా, ఒకరు గల్లంతయ్యారు.

Panama Bridge Explosion

Panama Bridge Explosion: పనామాలోని కీలక వంతెన అయిన బ్రిడ్జ్ ఆఫ్ అమెరికాస్ సమీపంలో జరిగిన భారీ పేలుడు అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యం గల సముద్ర మార్గాల్లో ఒకటైన ప‌నామా కెనాల్ పై నిర్మించిన ఈ వంతెన వద్ద ఈ ఘటన చోటుచేసుకోవడం వల్ల రవాణాపై ప్రభావం పడే అవకాశాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం, బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న సమయంలో బల్బోవా ప్రాంతంలోని ఆయిల్ ట్యాంక్ ఫెసిలిటీలో ముందుగా మంటలు చెలరేగాయి. అనంతరం భారీ శబ్దంతో పేలుళ్లు సంభవించాయి. క్షణాల్లోనే మంటలు విస్తరించి వంతెనను పూర్తిగా కమ్మేశాయి. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

తాత్కాలికంగా వాహ‌నాలు నిలిపివేత‌..

ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, ఒకరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రత ఎంత మేరకు వంతెనను దెబ్బతీసిందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. భద్రతా కారణాల దృష్ట్యా వంతెనపై వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

Also Read: భారీగా తగ్గిన బంగారం ధర.. వెండి మాత్రం పైపైకే..హైదరాబాద్‌లో తులం రేటు ఎంతంటే?

పనామా పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక సాంకేతిక బృందాలను రంగంలోకి దించి వంతెన స్థితిగతులను పరిశీలిస్తోంది. పూర్తిస్థాయిలో భద్రతా తనిఖీలు పూర్తి చేసిన తర్వాతే తిరిగి రాకపోకలకు అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు

అమెరికా అప్ర‌మ‌త్తం…

సుమారు 1.6 కిలోమీటర్ల పొడవు గల ఈ వంతెన పనామా నగరాన్ని వాణిజ్య మార్గాలు మరియు కాలువతో కలిపే కీలక లింక్‌గా పనిచేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా చమురు రవాణా, వాణిజ్య నౌకాయానానికి ఈ మార్గం అత్యంత ప్రాధాన్యం కలిగినది.

ఇటీవల స్ట్రైయిట్ ఆఫ్ హ‌ర్మూజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో సాంప్రదాయ ట్యాంకర్ మార్గాలు ప్రభావితమయ్యాయి. దీంతో అనేక దేశాలు తమ చమురు రవాణాను పనామా కాలువ మార్గం ద్వారా మళ్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఈ పేలుడు అమెరికాను అప్రమత్తం చేసింది. ఘటనకు గల కారణాలపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ ఘటన వెనుక సాంకేతిక లోపమా, ప్రమాదవశాత్తూ జరిగిందా లేదా ఇతర కారణాలున్నాయా అనే విషయంపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ప్రపంచ వాణిజ్యంపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »