Tamil Nadu | తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ సీఎం కార్యాలయంలో కీలక అధికారులను నియమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు సన్నిహితుడిగా భావించే జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్‌కు రాజకీయ వ్యవహారాల ప్రత్యేక అధికారి (Officer on Special Duty)గా బాధ్యతలు అప్పగించారు. ఆయన నియామకం ప్రస్తుతం తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు విజయ్‌కు గవర్నర్ నుంచి కొన్ని రాజ్యాంగపరమైన ఇబ్బందులు ఎదురైనట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో తొలుత ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. అనంతరం కాంగ్రెస్, వీసీకే పార్టీల మద్దతుతో విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లభించింది.
ఆయన సూచనలతోనే..
ఈ నెల 10న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొదట ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మే 10న మధ్యాహ్నం 3.45 గంటలకు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, చివరి నిమిషంలో సమయంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. రాధన్ పండిట్ వెట్రివేల్ సూచనల మేరకు ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహించారని సమాచారం. విజయ్ రాజకీయ ప్రయాణంలో వెట్రివేల్ కీలక పాత్ర పోషించినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. పార్టీ స్థాపన నుంచి ఎన్నికల వ్యూహాల వరకు పలు అంశాల్లో ఆయన సూచనలు ఇచ్చినట్లుగా టాక్. ఎన్నికలకు ముందే విజయ్ భారీ విజయాన్ని సాధిస్తారని వెట్రివేల్ అంచనా వేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో ప్రముఖ జ్యోతిష్యుడిగా గుర్తింపు పొందిన వెట్రివేల్‌ను గతంలో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు సంప్రదించేవారన్న ప్రచారం ఉంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా కీలక నిర్ణయాల సమయంలో ఆయన సూచనలు తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అయితే, ఇందులో ఎంత వరకు నిజం ఉన్నది అనేది స్పష్టత లేదు.
ఢిల్లీకి వెళ్లి..
2008లో ఢిల్లీకి వెళ్లిన తర్వాత వెట్రివేల్ తన పేరును ‘రాధన్ పండిట్’గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ పలువురు జాతీయ నాయకులతో ఆయన పరిచయాలు పెంచుకున్నట్లు సన్నిహితులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ, డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు చెందిన నేతలతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఆధ్యాత్మిక, జ్యోతిష్య అంశాలపై సూచనలు ఇస్తూ ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రికజగం పార్టీ 234 స్థానాల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే పూర్తి మెజారిటీ సాధించలేకపోవడంతో కాంగ్రెస్, వీసీకే మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గతంలో వెట్రివేల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. విజయ్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదుగుతారని ఆయన చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


