Bharathiraja | భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ జీవన వాస్తవాలను వెండితెరపై ఆవిష్కరించిన ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా బుధవారం కన్నుమూశారు. 84 ఏళ్ల వయసులో ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఇటీవల మరింత క్షీణించింది. ఆయన మృతి తమిళ చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులను విషాదంలో ముంచెత్తింది. గత ఏడాది ఆయన కుటుంబంలో చోటుచేసుకున్న విషాదం భారతీరాజాను తీవ్రంగా కలిచివేసింది. 2025 మార్చిలో కుమారుడు, నటుడు మనోజ్ భారతీరాజా ఆకస్మిక గుండెపోటుతో మరణించడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆ సంఘటన అనంతరం ఆరోగ్యపరమైన ఇబ్బందులు పెరిగాయి. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో పలుమార్లు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన, ఈ ఏడాది ప్రారంభంలోనూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. చివరికి చికిత్స ఫలించక ఆయన కన్నుమూశారు.
16 వయతినిలే మూవీతో దర్శకుడిగా..
1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా సమీపంలోని అల్లినగరం గ్రామంలో జన్మించిన భారతీరాజా అసలు పేరు చిన్నసామి. 1977లో విడుదలైన ‘16 వయతినిలే’ చిత్రంతో దర్శకుడిగా సినీ రంగంలో ప్రవేశించారు. గ్రామీణ నేపథ్యాన్ని అత్యంత సహజత్వంతో తెరపై ఆవిష్కరించిన ఆ చిత్రం తమిళ సినీ పరిశ్రమలో కొత్త దిశను నిర్దేశించింది. అదే చిత్రం తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ పేరుతో తెరకెక్కి విశేష ఆదరణ పొందింది. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన సుమారు 40 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘కిళక్కే పోగుమ్ రైల్’, ‘సిగప్పు రోజాక్కళ్’, ‘ముదల్ మరియాదై’, ‘వేదం పుదిదు’ వంటి చిత్రాల ద్వారా గ్రామీణ సమాజం, కుల వివక్ష, మానవ సంబంధాల సున్నిత కోణాలను ప్రతిబింబించారు. తెలుగులో రూపొందించిన ‘సీతాకోకచిలుక’, ‘ఆరాధన’, ‘జమదగ్ని’ చిత్రాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడు, నిర్మాతగా కూడా ఆయన విశేష గుర్తింపు సంపాదించారు.
ఎంతో మంది నటులకు..
సినీ రంగానికి అనేక మంది ప్రతిభావంతులను పరిచయం చేసిన భారతీరాజా, కార్తీక్, రేవతి వంటి నటీనటుల ఎదుగుదలకు మార్గదర్శకుడయ్యారు. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘మంగమ్మ గారి మనవడు’ చిత్రానికి కథను అందించగా, ‘పల్నాటి పౌరుషం’ సినిమాకు కథా నిర్మాణంలో భాగస్వామ్యమయ్యారు. ‘సీతాకోకచిలుక’ చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్ర అవార్డు లభించగా, అదే చిత్రానికి గాను ఆయనకు ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారం దక్కింది. భారతీయ సినిమాకు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయనకు ఆరు జాతీయ చలనచిత్ర పురస్కారాలు లభించాయి. కేంద్ర ప్రభుత్వం 2004లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ‘మిరాకిల్ డైరెక్టర్’గా అభిమానుల ప్రశంసలు అందుకున్న భారతీరాజా మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంత్యక్రియల ఏర్పాట్లపై కుటుంబ సభ్యులు త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు.


