మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం గ్లోబల్ క్రీడారంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ప్రాంతంలో భద్రతా పరిస్థితులు క్షీణించాయి. ఫలితంగా పలు అంతర్జాతీయ టోర్నీలు, ఈవెంట్ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఫుట్‌బాల్ అభిమానులను ముఖ్యంగా ఆందోళనకు గురిచేస్తున్న అంశం ‘ఫైనలిసిమా’ మ్యాచ్. ఈ నెల 27న ఖతార్ వేదికగా స్పెయిన్–అర్జెంటీనా జట్ల మధ్య జరగాల్సిన ఈ ప్రతిష్ఠాత్మక పోటీపై అనిశ్చితి నెలకొంది. అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ మరో ట్రోఫీ సాధించాలనే లక్ష్యంతో ఉన్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. పరిస్థితిని సమీక్షిస్తున్నామని UEFA వెల్లడించింది. ఇప్పటికే ఖతార్ తమ దేశంలో జరుగాల్సిన అన్ని సాకర్ మ్యాచ్‌లను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిలిపివేసినట్లు సమాచారం.
సౌదీ క్లబ్ అల్-నసర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిస్టియానో రొనాల్డో పాల్గొనాల్సిన ఆసియన్ ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్ కూడా రద్దయింది. దీంతో రొనాల్డో జట్టు షెడ్యూల్ పూర్తిగా మారిపోయింది.
ఫార్ములా–1పై కూడా ప్రభావం
మరోవైపు ఫార్ములా–1 అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది. వచ్చే నెలలో బహ్రెయిన్, సౌదీ అరేబియాలో ఎఫ్1 రేసులు జరగాల్సి ఉంది. రేసులకు కొన్ని వారాల ముందుగానే సిబ్బంది, కార్లు, సాంకేతిక సామగ్రి తరలించాల్సి ఉండటంతో నిర్వాహకులపై ఒత్తిడి పెరిగింది. స్టార్ డ్రైవర్ లూయిస్ హమిల్టన్ సహా పలువురు డ్రైవర్ల షెడ్యూల్స్ అనిశ్చితిలో పడే అవకాశం ఉంది. క్రీడాకారుల భద్రతే ప్రథమ ప్రాధాన్యమని FIA స్పష్టం చేసింది.
ప్రయాణ ఆంక్షల సమస్య
కేవలం మ్యాచ్‌ల రద్దు మాత్రమే కాదు, ప్రయాణ ఆంక్షలు కూడా క్రీడాకారులకు ఇబ్బందిగా మారాయి. దుబాయ్‌లో టోర్నీ ముగించుకున్న టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదేవ్ సహా పలువురు ఆటగాళ్లు విమానాల లభ్యత కోసం ఎదురుచూస్తున్నారు. ఇక టీ20 ప్రపంచకప్‌లో పాల్గొన్న వెస్టిండీస్ క్రికెట్ జట్టు కూడా భారత్‌లోనే నిలిచిపోయినట్లు సమాచారం. విమాన మార్గాల్లో మార్పులు, భద్రతా హెచ్చరికలతో ప్రయాణ ప్రణాళికలు పూర్తిగా మారుతున్నాయి.
భవిష్యత్తుపై అనిశ్చితి
గత దశాబ్ద కాలంగా సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాలు ప్రపంచ క్రీడా ఈవెంట్లకు కీలక కేంద్రాలుగా ఎదిగాయి. సౌదీ అరేబియా 2034 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనుండగా, ఖతార్ అనేక అంతర్జాతీయ టోర్నీలను విజయవంతంగా నిర్వహించింది. అయితే తాజా యుద్ధ వాతావరణం ఈ దేశాల క్రీడా ప్రణాళికలపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్న నిర్వాహకులు త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భద్రతా పరిస్థితులు మెరుగుపడకపోతే, గ్లోబల్ స్పోర్ట్స్ క్యాలెండర్‌లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.