ఇరాన్‌పై కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే మరో నెలరోజులు యుద్ధాన్ని కొనసాగించేందుకు అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ది న్యూయార్క్ టైమ్స్‌కి ఇచ్చిన ప్రత్యేక టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాకి ప్రాణనష్టం జరిగే అవకాశముందని హెచ్చరిస్తూనే, ఇరాన్‌పై యుద్ధ తీవ్రతను కొనసాగించడం ఇజ్రాయెల్, అమెరికాలకు పెద్ద కష్టమేమీ కాదన్నారు. అవసరమైతే సైనిక దాడులు కొనసాగించడానికి పెంటగాన్ వద్ద తగినంత బలగాలు, క్షిపణులు, బాంబులు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
అయితే ఇరాన్‌లో కొత్త ప్రభుత్వానికి అధికారం ఎలా బదిలీ అవుతుందన్న విషయంలో మాత్రం ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న అధికార యంత్రాంగమే కొనసాగుతుందా? లేక పూర్తిగా కూల్చివేయబడుతుందా? అన్న ప్రశ్నలపై పరస్పర విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
Also Read: ఖమేనీ కుటుంబం మొత్తం చనిపోయిందా.. ఇరానియన్ల సంబురాలు ఓ రేంజ్‌లో… వీడియోలు వైరల్
“మూడు మంచి ఎంపికలు” ఉన్నాయన్న ట్రంప్
ఇరాన్‌కు భవిష్యత్ నాయకత్వం వహించగల మూడు మంచి ఎంపికలు తన దృష్టిలో ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. అయితే వారి పేర్లను వెల్లడించడానికి నిరాకరించారు. ఇరాన్‌లో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుపై రాబోయే వారాల్లో స్పష్టత వస్తుందన్న సంకేతాలు ఇచ్చినా, ట్రంప్ యంత్రాంగం ఇంకా అనిశ్చితిలోనే ఉన్నట్లు ఈ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడైంది.
గతంలో వెనిజులాను విజయవంతమైన ఆపరేషన్ నమూనాగా ప్రస్తావించిన ట్రంప్, ఇరాన్‌లో కూడా అమెరికాకు స్నేహపూర్వకంగా ఉండే నాయకత్వం రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌లో పరిణామాలు
ఇటీవల అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేని మరణించినట్లు అంతర్జాతీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇరాన్‌లో తదుపరి సుప్రీం లీడర్ ఎవరన్నది చర్చనీయాంశమైంది. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన ISNA వార్తా సంస్థ ప్రకారం, సీనియర్ మతాధికారి అలిరేజా అరాఫీ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ఖమేనీ మరణం అనంతరం ఇరాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 111ను అమలు చేశారు. శాశ్వత సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే వరకు ముగ్గురు సభ్యులతో కూడిన కౌన్సిల్ దేశ పరిపాలన బాధ్యతలు చేపడుతుంది.
ఈ కౌన్సిల్‌లో అలిరేజా అరాఫీతో పాటు అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, ప్రధాన న్యాయమూర్తి ఘోలం-హోస్సేన్ మొహ్సేని-ఎజెయ్‌లతో కలిసి తాత్కాలికంగా దేశాన్ని నడిపించనున్నారు. ఇరాన్‌లో మారుతున్న రాజకీయ పరిణామాలు, అమెరికా–ఇజ్రాయెల్ వైఖరులు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.