భారత క్రికెట్‌లో అత్యంత వివాదాస్పద సంఘటనల్లో ఒకటైన 2008 ఐపీఎల్ తొలి సీజన్‌లో జరిగిన చెంపదెబ్బ ఘటన మరోసారి వార్తల్లోకి వచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భారత మాజీ పేసర్ ఎస్. శ్రీశాంత్ ఈ సంఘటనపై స్పందిస్తూ, మాజీ ఆఫ్‌స్పిన్నర్ హర్భజన్ సింగ్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
శ్రీశాంత్ మాట్లాడుతూ, “హర్భజన్ గురించి నేను ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదు. అతని గురించి మాట్లాడటం ఇదే మొదటిసారి. ఆ రోజు జరిగిన చెంపదెబ్బ ఘటనను నేను చాలా కాలం క్రితమే మర్చిపోయాను. అతడిని కూడా క్షమించాను. కానీ ఇటీవల అతడు చేసిన ఒక యాడ్ చూసిన తర్వాత నేను షాకయ్యాను అని తెలిపారు.
కోటి సంపాదించాడు..
ఆ యాడ్ ద్వారా హర్భజన్ సింగ్ దాదాపు కోటి రూపాయలు సంపాదించాడని శ్రీశాంత్ ఆరోపించారు. “ఆ ఘటనను వినియోగించుకుని డబ్బు సంపాదించడం నాకు బాధ కలిగించింది. అదే మా సంబంధాన్ని పూర్తిగా తెంచేసింది” అని పేర్కొన్నారు.
ఆ యాడ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయమని హర్భజన్ తనకు ఫోన్ చేసి కోరాడని చెప్పారు. అప్పుడు నేను అతడికి ఒకే మాట చెప్పాను ..నేను నిన్ను క్షమించాను, కానీ ఆ ఘటనను ఎప్పటికీ మర్చిపోను. మనకు జరిగిన చెడును క్షమించవచ్చు, కానీ మర్చిపోవడం వేరే విషయం అని శ్రీశాంత్ స్పష్టం చేశారు.
సానుభూతి పొందేందుకు..
ఇటీవల హర్భజన్ సింగ్ పలువురు ఇంటర్వ్యూలలో పాల్గొని, ఆ సంఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడని, సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని కూడా శ్రీశాంత్ విమర్శించారు. “తన కుమార్తె గురించి కూడా మాట్లాడాడు. కానీ అవన్నీ నాకు నటనలా అనిపించాయి” అని అన్నారు.
తనకు వ్యక్తిగతంగా హర్భజన్‌పై ఎలాంటి ద్వేషం లేదని చెప్పిన శ్రీశాంత్, “కానీ ఆ యాడ్ చూసిన తర్వాత నేను అతడిని సోషల్ మీడియాలో బ్లాక్ చేశాను. అప్పుడే అతడు ఇంటర్వ్యూలలో చెప్పింది నిజం కాదని అర్థమైంది” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దాదాపు 18 ఏళ్ల క్రితం జరిగిన ఘటనపై మళ్లీ ఇలాంటి ఆరోపణలు రావడంతో, ఈ వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది.
Also Read:


