Hardik Pandya Birthday | మ్యాగీ తిన్న రోజులు.. కోట్ల ఆస్తుల దాకా హార్దిక్ పాండ్య జర్నీ!

Hardik Pandya Birthday | ఆర్థిక ఇబ్బందులతో మ్యాగీ తింటూ క్రికెట్ ఆడిన హార్దిక్ పాండ్య.. ఐపీఎల్, టీమిండియా విజయాలతో స్టార్ క్రికెటర్‌గా ఎదిగారు. ఆయన కష్టాల నుంచి కోట్ల సంపద వరకు సాగిన ప్రయాణం ఇదే.

Hardik Pandya Birthday
Hardik Pandya Birthday

Hardik Pandya Birthday | భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య నేడు తన 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సాధారణ కుటుంబంలో జన్మించి నేడు భారత క్రికెట్‌లో సూపర్‌స్టార్‌గా ఎదిగిన హార్దిక్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. బ్యాట్, బాల్ రెండింటితోనూ జట్టుకు అద్భుతమైన సమతుల్యతను అందించిన అతడు ప్రస్తుతం భారత్ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు.

అయితే గాయాల కారణంగా కొంతకాలంగా హార్దిక్ కెరీర్‌కు అప్పుడప్పుడు బ్రేక్‌లు పడుతున్నాయి. ప్రస్తుతం కూడా గాయం కారణంగా టీమిండియా సెటప్‌కు దూరంగా ఉన్నప్పటికీ, త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌తో రీఎంట్రీ ఇస్తారని అందరూ ఆశిస్తున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఆయన కష్టాల నుంచి కోట్లకు అధిపతిగా ఎలా ఎదిగారనే ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం.

కష్టాలతో సాగిన బాల్యం

హార్దిక్ ప్రారంభ జీవితం ఎంతో కష్టాలతో కూడుకుని సాగింది. అతని తండ్రి హిమాన్షు పాండ్య సూరత్‌లో కార్ ఫైనాన్స్ బిజినెస్ చేసేవారు. అయితే అందులో తీవ్ర నష్టం రావడంతో కుటుంబం మొత్తం వడోదరకు వలస వచ్చింది.

ఇంట్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో హార్దిక్ స్కూల్ చదువు కూడా ఆగిపోయింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే.. హార్దిక్, అతడి అన్న కృణాల్ కేవలం మ్యాగీ తింటూ రోజంతా గడిపిన రోజులు కూడా ఉన్నాయి.

ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దిగజారడంతో స్వయంగా క్రికెట్ కిట్ కొనుగోలు చేసే స్తోమత కూడా లేక ఇతరుల దగ్గర కిట్ తీసుకుని ఆడేవారు. కొద్దిపాటి డబ్బుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి మరీ క్రికెట్ ఆడేవారు.

కలను మాత్రం వదులుకోలేదు

అయితే హార్దిక్ తన కలను మాత్రం ఎప్పటికీ వదులుకోలేదు. వనరుల కొరత వేధించినా ఎక్కడా వెనకడుగు వేయకుండా కష్టపడ్డాడు. ముందుగా లోకల్ టోర్నమెంట్లు, ఆ తర్వాత స్టేట్ టీమ్.. చివరకు ఐపీఎల్‌లోకి అడుగు పెట్టాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 2015లో ముంబై ఇండియన్స్‌తో హార్దిక్ ఒప్పందం కుదుర్చుకున్న క్షణం అతడి తలరాతనే మార్చేసింది. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన కొద్ది నెలల్లోనే భారత జాతీయ జట్టులోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.

ఆ తర్వాత హార్దిక్ వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. తన అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియాలో కీలక ఆటగాడిగా మారాడు.

కోట్లలో ఆదాయం.. విలాసవంతమైన జీవితం

క్రికెట్ మైదానంలో విజయాలతో పాటు హార్దిక్‌కు భారీగా పేరు ప్రఖ్యాతలు, సంపద కూడా వచ్చాయి. ఐపీఎల్, టీమిండియాలో రాణించడంతో పెద్ద పెద్ద బ్రాండ్లు ఆయన వెనుక పరిగెత్తాయి. ఒక్కో ప్రకటన కోసం కోట్ల రూపాయలతో డీల్స్ కుదిరాయి.

కష్టాలను ఎదుర్కొన్న హార్దిక్ నేడు తాను కలలు కన్న ప్రతి విలాసాన్ని అనుభవిస్తున్నారు. హార్దిక్ చేతికి కోట్ల విలువ చేసే గడియారాలు కనిపిస్తాయి. బట్టలు మార్చినట్లుగా కార్లను మారుస్తూ ఉంటాడు.

ఒకప్పుడు పూట గడవడానికి మ్యాగీ తిన్న హార్దిక్.. ఇప్పుడు విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు తన ఫిట్‌నెస్ దెబ్బతినకుండా ఉండేందుకు ఏకంగా సొంత ఖర్చులతో కోచ్‌ను కూడా వెంట తీసుకెళ్తాడు.

రూ.100 కోట్లకు పైగా ఆస్తులు?

నివేదికల ప్రకారం హార్దిక్ పాండ్య నికర ఆస్తులు రూ.95 కోట్ల నుంచి రూ.120 కోట్ల మధ్య ఉంటాయని అంచనా. ఐపీఎల్, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా వచ్చే జీతమే హార్దిక్ ప్రధాన ఆదాయ వనరు.

ఇవే కాకుండా బోట్, రిలయన్స్, ఎనర్జీ డ్రింక్స్ వంటి పలు పెద్ద బ్రాండ్లతో కోట్ల రూపాయల వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉన్నాడు.

ముంబై, వడోదరాల్లో విలాసవంతమైన ఇళ్లు, స్టార్టప్‌లలో ఈక్విటీ పెట్టుబడులు, లగ్జరీ కార్లు, వాచ్‌ల భారీ కలెక్షన్ హార్దిక్ సొంతం. ఒకప్పుడు కనీస అవసరాల కోసం కష్టపడిన అతడు.. తన ప్రతిభ, పట్టుదలతో భారత క్రికెట్‌లో స్టార్‌గా ఎదిగి కోట్ల సంపదకు అధిపతిగా మారాడు.

About Author:

Ch Roja Rani

గత 5 సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న జర్నలిస్ట్‌. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయిన Idreampost మరియు Wire Teluguలో పని చేసి విశేష అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం Mana Varta లో క్రీడలు (Sports…

More About Author »