రూ.14 వేల లంచం తీసుకుంటూ హాస్టల్‌ వార్డెన్‌ అరెస్ట్‌.. భద్రాద్రి కొత్తగూడెంలో ఏసీబీ వల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో రూ.14 వేల లంచం తీసుకుంటూ ఎస్టీ బాలుర హాస్టల్‌ ఇన్‌చార్జ్‌ వార్డెన్‌ బుక్యా వాలుసింహను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు.

ఎస్టీ బాలుర హాస్టల్‌ వార్డెన్‌,
భద్రాద్రి కొత్తగూడెంలో ఏసీబీ వల.. రూ.14 వేల లంచం తీసుకుంటూ హాస్టల్‌ వార్డెన్‌ అరెస్ట్‌

భద్రాద్రి కొత్తగూడెం: లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వ హాస్టల్‌ వార్డెన్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎస్టీ బాలుర హాస్టల్‌ వార్డెన్‌, రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బుక్యా వాలుసింహను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. చర్ల మండలం సత్యనారాయణపురంలోని ఎస్టీ బాలుర హాస్టల్‌కు ఇన్‌చార్జ్‌ వార్డెన్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఏసీబీ ఖమ్మం రేంజ్‌ అధికారులు సెప్టెంబర్‌ 18, 2026న సత్యనారాయణపురంలోని ఎస్టీ బాలుర హాస్టల్‌లో వాలుసింహను రూ.14,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు తెలిపారు.

సెలవును అనధికార గైర్హాజరుగా నమోదు చేయకుండా..

ఫిర్యాదుదారు 2026 ఆగస్టులో ఆరు రోజుల పాటు విధులకు గైర్హాజరయ్యారు. ఈ గైర్హాజరును అనధికారిక సెలవుగా నమోదు చేయకుండా ఉండేందుకు, భవిష్యత్తులో ఉద్యోగానికి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు వాలుసింహ లంచం డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.

అలాగే ఫిర్యాదుదారుడి జీతం బిల్లుల తయారీలో ఎలాంటి అడ్డంకులు సృష్టించబోనని కూడా ఆయన హామీ ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

మొదట రూ.15 వేలు డిమాండ్‌.. బేరసారాల తర్వాత రూ.14 వేలు

వాలుసింహ మొదట రూ.15,000 లంచం డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ తెలిపింది. అయితే బేరసారాల అనంతరం రూ.14,000కు అంగీకరించినట్లు పేర్కొంది. ఫిర్యాదుదారు ఆ మొత్తాన్ని చెల్లిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

ఆయన వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. వాలుసింహ రెండు చేతులకు రసాయన పరీక్షలు నిర్వహించగా, ఆ పరీక్షల్లో పాజిటివ్‌ ఫలితాలు వచ్చినట్లు ఏసీబీ వెల్లడించింది. పరీక్షల్లో ఉపయోగించిన ద్రావణం గులాబీ రంగులోకి మారినట్లు తెలిపింది.

ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు

ప్రభుత్వ ఉద్యోగిగా తన విధులను అక్రమంగా, నిజాయతీకి విరుద్ధంగా నిర్వర్తించి అనుచిత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

వాలుసింహను అరెస్ట్‌ చేసి వరంగల్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ వెల్లడించింది.

లంచం డిమాండ్‌ చేస్తే 1064కు ఫిర్యాదు చేయండి

ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్‌ చేస్తే ప్రజలు ఏసీబీకి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. లంచం సంబంధిత ఫిర్యాదులను ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు తెలియజేయవచ్చని తెలిపారు.

అలాగే ఏసీబీ వాట్సాప్‌ నంబర్‌, ఫేస్‌బుక్‌ పేజీ, ఎక్స్‌ ఖాతా ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »