నిజామాబాద్‌లో దారుణం.. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు నిందితుడు హరిబాబు హత్య

నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తాలో యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు నిందితుడు హరిబాబును గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేసి హత్య చేశారు. సీసీటీవీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

vaishnavi murder case
vaishnavi murder case

నిజామాబాద్: నిజామాబాద్‌లో పట్టపగలే దారుణ హత్య చోటుచేసుకుంది. కొద్ది నెలల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న ఆమె భర్త హరిబాబును గుర్తు తెలియని దుండగులు నడిరోడ్డుపై అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నిజామాబాద్‌లో తీవ్ర కలకలం రేపుతోంది.

నిజామాబాద్‌లోని ఆర్ఆర్ చౌరస్తా ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం. అయితే అదే ప్రాంతం ఒక్కసారిగా రక్తసిక్తమైంది. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో అరెస్టై, ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న ఆమె భర్త హరిబాబు రోడ్డుపై వెళ్తుండగా కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగుడు అకస్మాత్తుగా దాడి చేసినట్లు తెలుస్తోంది.

కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో హరిబాబుపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అసలు ఎవరు హరిబాబు?

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల వైష్ణవి యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో హరిబాబుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దాదాపు పది నెలల పరిచయం అనంతరం 2025 మే 29న వెంకటేశ్వర ఆలయంలో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.

పెళ్లి సమయంలో వైష్ణవి కుటుంబం రూ.5 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ డబ్బు సరిపోలేదని, మరో రూ.5 లక్షలు తీసుకురావాలని హరిబాబు తన భార్యను తరచూ వేధించేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపులకు హరిబాబు తల్లి లక్ష్మి, అతని అన్నలు ఆనంద్, అశోక్ కూడా వత్తాసు పలికినట్లు కేసు వివరాల్లో పేర్కొనబడింది.

గర్భిణీ అయిన వైష్ణవిని హత్య చేసినట్లు ఆరోపణలు

కట్నం కోసం వేధింపులకు గురైన వైష్ణవి నాలుగు నెలల గర్భిణీగా ఉన్న సమయంలో హరిబాబు ఆమెపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.

వైష్ణవిని హత్య చేసిన అనంతరం హరిబాబు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు అతడిని కోనరావుపేట క్రాస్‌ రోడ్డు వద్ద అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

కట్నం కోసం తన భార్యను, పుట్టబోయే బిడ్డను బలి తీసుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హరిబాబు.. కొంతకాలం తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్ది రోజులకే అతడు కూడా కత్తి దాడిలో హత్యకు గురికావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వైష్ణవిని చంపినట్లుగానే హరిబాబు హత్య

వైష్ణవిపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హరిబాబు.. ఇప్పుడు అదే తరహాలో నడిరోడ్డుపై కత్తి దాడికి గురై హత్యకు గురికావడం గమనార్హం. దీంతో ఈ హత్య వెనుక ప్రతీకార కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హరిబాబును హత్య చేసింది ఎవరు? వైష్ణవి తరపు బంధువులే పగ తీర్చుకున్నారా? లేక హరిబాబుకు మరేదైనా పాత కక్షలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీసీటీవీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు

ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కారులో వచ్చిన దుండగుడు ఎవరు? అతడితో పాటు మరెవరైనా ఉన్నారా? హత్యకు ఉపయోగించిన ఆయుధం ఏమిటి? అనే వివరాలను సేకరిస్తున్నారు.

హరిబాబు కదలికలు, అతడికి ఉన్న పాత పరిచయాలు, వైష్ణవి కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు, ఇతర వ్యక్తులతో ఉన్న కక్షలు వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వివరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ హత్యకు అసలు కారణం ఏమిటనేది పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »