హైదరాబాద్: కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం పరిశీలించారు. చెరువు అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో గణేశ్ నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసిన ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎత్తైన విగ్రహాలను సైతం నిమజ్జనం చేసేలా చెరువు లోతును 25 అడుగులకు పైగా పెంచినట్లు అధికారులు వివరించారు.
వేలాది గణేశ్ విగ్రహాలను చెరువులోకి తరలించేందుకు ప్రధాన రహదారి వైపు ఏర్పాటు చేసిన భారీ క్రేన్లను హైడ్రా కమిషనర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. నిమజ్జనం జరుగుతుండగానే చెరువులో వేసిన విగ్రహాలను తొలగించేందుకు చేసిన ఏర్పాట్లను అధికారులు ఆయనకు వివరించారు.
— ఐడీఎల్ చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్
— ఆంజనేయనగర్ రహదారిలో అడ్డంకులపై ఆరా
— గణేష్ నిమజ్జన ఏర్పాట్లను వివరించిన అధికారులు❇️ కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో గణేష్ నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసిన ఏర్పాట్లను… pic.twitter.com/M0TmRPu6nO
— HYDRAA (@Comm_HYDRAA) September 18, 2026
చెరువు అభివృద్ధి పనులు జరుగుతున్న పరిస్థితుల్లో గణేశ్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని హైడ్రా కమిషనర్ గతంలో అధికారులను ఆదేశించారు. ఆ మేరకు చేపట్టిన ఏర్పాట్లను శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఐడీఎల్ చెరువులో పూడికతీత పనులు చేపట్టి, నీటితో నింపడంతో పాటు 25 అడుగులకు పైగా లోతు పెంచడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులతో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, సమన్వయంతో పనిచేయాలని హైడ్రా అధికారులకు ఏవీ రంగనాథ్ సూచించారు.
ఆంజనేయనగర్ రహదారి అడ్డంకులపై పరిశీలన
ఐడీఎల్ చెరువు సందర్శన అనంతరం పక్కనే ఉన్న ఆంజనేయనగర్ రహదారి అడ్డంకులపై ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదును హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆంజనేయనగర్ మీదుగా నిర్మాణంలో ఉన్న వైట్‌వాటర్ అపార్ట్‌మెంట్స్ పక్కన 100 అడుగుల రహదారి ఉందని, దానిపై కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని స్థానికులు హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ రహదారి ద్వారా ఆంజనేయనగర్ నుంచి సులభంగా కూకట్‌పల్లి రోడ్డుకు చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఆక్రమణల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
రహదారిపై నుంచి హైటెన్షన్ విద్యుత్ వైర్లు కూడా వెళ్తున్న నేపథ్యంలో ఎవరూ అడ్డంకులు సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఆక్రమణలను తొలగించి రహదారిని పునరుద్ధరించాలని సూచించారు.
హైటెన్షన్ వైర్ల కింద ఉన్న ప్రధాన రహదారిని ఆక్రమించి బస్సుల పార్కింగ్‌కు వినియోగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలను పరిశీలించి రహదారిని పునరుద్ధరించడంతో పాటు, దానికి ఆనుకుని ఉన్న పార్కు స్థలాలను కూడా పరిరక్షించాలని అధికారులను ఆదేశించారు.
ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో హైడ్రా అదనపు కమిషనర్ డి. ఆనంద్‌కుమార్, ఏసీపీ పి. తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.


