డిండి రిజర్వాయర్‌పై గ్రామస్థుల ఆవేదన.. ‘మా ఊరు మాకే కావాలి’

డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా రిజర్వాయర్‌ నిర్మాణంతో భూములు, ఇళ్లు కోల్పోతున్నామని ఎర్రవెల్లి, గోకారం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం, పునరావాసంపై న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Dindi Reservoir Villagers Anguish
Dindi Reservoir Villagers Anguish

నీటి ఎద్దడితో అల్లాడుతున్న ప్రాంతాలకు సాగు, తాగునీరు అందుతుందని భావించిన అన్నదాతలకు ఇప్పుడు భూములు, ఇళ్లు కోల్పోయే పరిస్థితి ఎదురైందని నాగర్‌కర్నూల్‌ జిల్లా గోకారం, ఎర్రవెల్లి గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ నిర్మిస్తామని చెప్పి, ఆ తర్వాత రిజర్వాయర్‌గా మార్చడంతో తమ జీవనాధారమైన భూములు ముంపునకు గురవుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఎర్రవెల్లి వాసులు తొమ్మిది నెలలుగా నిరసనలు కొనసాగిస్తున్నారు.

నల్గొండకు సాగు, తాగునీరు అందించేందుకు డిండి ఎత్తిపోతల పథకం

నల్గొండ జిల్లాలోని కరువు, ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులోని ఏదుల రిజర్వాయర్‌ నుంచి డిండి, సింగరాజుపల్లి, గోకారం, గొట్టి ముక్కల మీదుగా నల్గొండ జిల్లాలోని శివన్నగూడెం, బస్వాపురం తదితర ప్రాంతాలకు నీటిని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ పథకంలో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలంలోని గోకారం వద్ద రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఈ రిజర్వాయర్‌ నిర్మాణంతో ఎర్రవెల్లి పక్కన ఉన్న తండాలు పూర్తిగా ముంపునకు గురయ్యే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. గోకారం గ్రామం మినహా మిగిలిన ప్రాంతాల్లోని రైతుల భూములు కూడా కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాలువ పేరుతో సర్వే చేసి.. రిజర్వాయర్‌గా మార్చారని ఆరోపణ

అధికారులు తొలుత కాలువ నిర్మాణం పేరుతో భూసేకరణ సర్వే చేపట్టారని ఎర్రవెల్లి, గోకారం గ్రామాల ప్రజలు చెబుతున్నారు. కాలువ నిర్మాణానికి కొద్దిపాటి భూమి మాత్రమే పోతుందని, కాలువ కింద నీరు అందడంతో పంటలు పండించుకోవచ్చని తాము ఆశించామని తెలిపారు.

అయితే ఆ తర్వాత కాలువ నిర్మాణాన్ని రిజర్వాయర్‌గా మార్చారని, దీంతో తమ భూములు, ఇళ్లు పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపిస్తున్నారు. రిజర్వాయర్‌ నిర్మాణానికి భూములు ఇవ్వబోమంటూ తొమ్మిది నెలలుగా ప్రతిరోజూ ఉదయం రెండు నుంచి మూడు గంటల పాటు నిరసనలు చేస్తున్నామని తెలిపారు.

తమ ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పండుగలను సైతం బహిష్కరించారు. చివరకు గ్రామ దేవతలైనా తమను కాపాడుతారనే ఆశతో తిరిగి బోనాలు నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు.

1,600 ఎకరాల భూములు కోల్పోయే పరిస్థితి

2016–17లో గత ప్రభుత్వం రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా భూసేకరణ ప్రక్రియను ప్రారంభించిందని స్థానికులు తెలిపారు. ఎర్రవెల్లి, గోకారం గ్రామాల మధ్య సుమారు 1,600 ఎకరాల భూములు రిజర్వాయర్‌ నిర్మాణంలో పోతాయని చెబుతున్నారు.

భూసేకరణ సమయంలో తాము వ్యతిరేకిస్తున్నప్పటికీ బూటకపు హామీలు ఇచ్చి, భయభ్రాంతులకు గురిచేసి, ఫోర్జరీ సంతకాలతో భూములు సేకరించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పలు సంక్షేమ పథకాల పేరుతో బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుని, పరిహారం జమ చేశారని అంటున్నారు.

పక్క గ్రామాల్లో భూముల ధరలు కోట్ల రూపాయల్లో ఉండగా, తమకు ఎకరానికి రూ.5.50 లక్షల పరిహారం ఇవ్వడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఆ మొత్తంతో ఇల్లు కట్టుకోవడం కూడా సాధ్యం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచిస్తున్న గ్రామస్థులు

రిజర్వాయర్‌ నిర్మాణానికి తాము పూర్తిగా వ్యతిరేకం కాదని, అయితే భూములు తీసుకునే విధానంపై తమతో చర్చించాలని గ్రామస్థులు కోరుతున్నారు. గోకారం చెరువు ఇప్పటికే సుమారు 700 నుంచి 800 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, బఫర్‌ జోన్‌తో కలిపి మరింత విస్తీర్ణం ఉంటుందని చెబుతున్నారు.

ఆ చెరువును మినీ రిజర్వాయర్‌గా మార్చి, కాలువ ద్వారా నీటిని తరలిస్తే తమ ఇళ్లు, భూములు ముంపునకు గురికాకుండా చూడవచ్చని సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించకుండా తమను బలవంతంగా ఖాళీ చేయించడం అన్యాయమని అంటున్నారు.

“మా ఊరు మిగలడం లేదు.. మా పిల్లల పరిస్థితి ఏంటి?”

తమకు ఊరు, భూములు, జీవనాధారం ఏదీ మిగలడం లేదని ఎర్రవెల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్లు, పంట పొలాలు కోల్పోయిన తర్వాత తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు.

ఒక గ్రామస్థుడు మాట్లాడుతూ.. తమకు ఎకరానికి రూ.5.50 లక్షలు మాత్రమే పరిహారం ఇచ్చారని తెలిపారు. పక్కనే ఉన్న తుర్కపల్లి, చారకొండ ప్రాంతాల్లో భూములకు కోట్ల రూపాయల ధరలు పలుకుతున్నాయని, తమ భూములకు మాత్రం తక్కువ పరిహారం ఇవ్వడం సరైంది కాదన్నారు.

“మా జీవనాధారం వ్యవసాయమే. నాకు ఐదు ఎకరాల భూమి, ఒక బోరు ఉంది. ఆ భూమిపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. భూమి పోతే మాకు ఇంకేం మిగలదు. మేము ఎప్పుడూ వలస వెళ్లకుండా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాం. ఇప్పుడు మొత్తం భూమి పోయిన తర్వాత ఎలా బతకాలి?” అని ఆవేదన వ్యక్తం చేశారు.

మరో గ్రామస్థుడు మాట్లాడుతూ.. తమకు తెలియకుండానే పత్రాలపై సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. కరువుపైసలు, పరిహారం పేరుతో తమకు తెలియని చోట భూములకు సంబంధించిన ప్రక్రియలు పూర్తి చేశారని అన్నారు. తమ ఊరు తమకే కావాలని, అవసరమైతే తమ భూములను కాపాడుకునేందుకు పోరాటం చేస్తామని తెలిపారు.

తొమ్మిదేళ్లుగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆరోపణ

ముంపు ప్రాంతంగా గుర్తించడంతో గత తొమ్మిదేళ్లుగా గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయించడం లేదని ఎర్రవెల్లి వాసులు చెబుతున్నారు. సీసీ రోడ్లు, ఇళ్లు, నీటి ట్యాంకులు వంటి అభివృద్ధి పనులు మంజూరు చేయడం లేదని ఆరోపిస్తున్నారు.

గ్రామ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలంటూ సర్పంచ్‌ ఎన్నికలను కూడా బహిష్కరించినట్లు తెలిపారు. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ, గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు, కనీస సౌకర్యాల కల్పనకు నిధులు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీఎం తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో న్యాయం చేయాలని వేడుకోలు

తమ ప్రాంతం ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా కరువు, వలసలతో ఇబ్బందులు పడుతోందని ఎర్రవెల్లి వాసులు తెలిపారు. నీటి ప్రాజెక్టుల పేరుతో తమకు మరోసారి అన్యాయం చేయొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ముఖ్యమంత్రి ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో తమ పరిస్థితిని అర్థం చేసుకుని దయ చూపాలని, తమ భూములు, ఇళ్లు కోల్పోకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భూసేకరణ, పరిహారం, పునరావాసంపై తమతో చర్చించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »