Nowhera Shaik | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హీరా గ్రూప్ పెట్టుబడి మోసం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ నౌహీరా షేక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భారీ స్థాయిలో పెట్టుబడులు సేకరించి, అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. దర్యాప్తు సంస్థల సమాచారం ప్రకారం.. నౌహీరా షేక్ కొంతకాలంగా అధికారుల కంటపడకుండా మారుపేర్లతో జీవనం సాగిస్తున్నట్లు గుర్తించారు. గుర్గావ్‌లో ఫేక్ ఆధార్ కార్డుతో నివాసం ఉన్నట్లుగా ఈడీకి సమాచారం అందింది. ఈ మేరకు పూర్తిస్థాయిలో నిఘా వేసిన అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Read Also : మరోసారి పెట్రో మోత.. ఆందోళనకు గురవుతున్న వాహనదారులు..!
రూ.5600 కోట్ల మోసం ఆరోపణలు..
హీరా గ్రూప్ సంస్థల పేరిట దేశంలోని వివిధ ప్రాంతాల్లో జనం నుంచి రూ.5,600కోట్లు డిపాజిట్లు సేకరించినట్లుగా ఆరోపణలున్నాయి. పెట్టుబడిదారులకు సంవత్సరానికి 36 శాతం వరకు వార్షిక వడ్డీ చెల్లిస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి జనాన్ని ఆకర్షించారు. ఇచ్చిన హామీ మేరకు వడ్డీ చెల్లించకపోవడం, ఆ తర్వాత పెట్టుబడులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఈడీతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసి ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టాయి.
Read Also : భగీరథ్ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు..! మరో సెక్షన్ జోడించిన పోలీసులు..!
సంస్థకు సంబంధించిన ఆస్తులు, బ్యాంక్ ఖాతాలు, ఆర్థిక వివరాలపై కూడా విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే పలు దఫాలుగా విచారణలు జరిగినప్పటికీ, నౌహీరా షేక్ అజ్ఞాతంలోకి వెళ్లడం దర్యాప్తుకు సవాల్‌గా మారింది. తాజాగా ఆమె అరెస్టుతో కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. బాధితుల్లో చాలామంది తమ పొదుపు మొత్తాన్ని కోల్పోయినట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అధిక వడ్డీ ఆశ చూపి పెట్టుబడులు ఆకర్షించే సంస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన మరిన్ని ఆర్థిక లావాదేవీలు, అనుబంధ సంస్థల పాత్రపై ఈడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
Read Also : ఉప్పల్‌లో ఆర్‌సీబీతో తలపడనున్న సన్‌రైజర్స్.. నగరంలో 12 గంటలు ట్రాఫిక్ ఆంక్షలు..!


