Minister Ponnam Prabhakar | మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయాలు (MJPTBCWR Schools) రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవాలనే దిశగా ‘బ్రాండ్ ఇమేజ్’ (Brand Image) క్రియేట్ చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గురుకుల పాఠశాలల పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలపై గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. విద్యార్థులకు సమగ్ర విద్యాబోధన (Comprehensive Education) జరగాలని, చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్, ఏఐ (AI) వంటి అంశాల్లోనూ ప్రోత్సాహం అందించాలని మంత్రి తెలిపారు. 8వ తరగతి నుంచే నీట్ (NEET), ఎంసెట్ (EAMCET) వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రిన్సిపాళ్లను అభినందించిన మంత్రి, ఫలితాలు తక్కువగా వచ్చిన విద్యాసంస్థలు కారణాలను సమీక్షించుకోవాలని హెచ్చరించారు. వచ్చే విద్యాసంవత్సరంలో మెరుగైన ఫలితాలు సాధించేలా పని చేయాలని సూచించారు. గతంలో 327 స్కూళ్లలో 301 స్కూళ్లు ప్రైవేట్ భవనాల్లో ఉన్నాయని, ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇవ్వడంతో గురుకులాలు మెరుగ్గా పనిచేస్తున్నాయని తెలిపారు.
గురుకులాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, మెస్ ఛార్జీలు, కాస్మొటిక్ ఛార్జీలు పెంచి నాణ్యమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. తల్లిదండ్రుల నమ్మకంతో పిల్లలు గురుకులాలకు వస్తున్నారని, ఉపాధ్యాయులే వారికి మార్గదర్శకులని మంత్రి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉందని, వారిని తమ సొంత పిల్లల మాదిరిగా చూసుకోవాలని సూచించారు. 2026-27 విద్యాసంవత్సరానికి బీసీ సంక్షేమ శాఖ గురుకులాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని మంత్రి ఆకాంక్షించారు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా పూర్తి స్థాయిలో బోధన జరగాలని, మౌలిక సదుపాయాలు లేనిచోట ప్రిన్సిపాళ్లు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. టాయిలెట్స్, ఫ్యాన్స్ వంటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎంజేపీ గురుకులాలు కుటుంబంలా పనిచేయాలని, విద్యార్థులకు క్రమశిక్షణ, సామాజిక విలువలు, పెద్దలతో ప్రవర్తన వంటి అంశాలు నేర్పించాలని సూచించారు. చిన్న చిన్న కారణాలతో విద్యార్థుల ఆత్మహత్యలు జరగకుండా మనోధైర్యం కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. జిల్లాల వారీగా స్కూళ్ల పనితీరు సమీక్షలు నిర్వహించాలని, 100 శాతం ఫలితాలు సాధించిన స్కూళ్లను అభినందించాలని, తక్కువ ఫలితాలు వచ్చిన వాటిని ఆత్మపరిశీలన చేసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.
Read Also : ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకులకు కిసాన్ సమ్మానిధి వస్తుందా..? త్వరలోనే రైతుల ఖాతాల్లోకి 23వ విడత నిధులు..!
అధ్యాపకులందరూ కలిసి ఎంజేపీకి బ్రాండ్ ఇమేజ్ (Brand Image) తీసుకురావాలని, ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా ఇక్కడ చదవాలనే స్థాయికి తీసుకురావాలని కోరారు. 10వ తరగతి ఫలితాల్లో 98.45 శాతం ఉత్తీర్ణత సాధించినందుకు సెక్రటరీ సైదులు సహా ప్రిన్సిపాళ్లను అభినందించారు. 500కి పైగా మార్కులు సాధించిన 9788 మంది విద్యార్థులు, 204 గురుకులాలు 100 శాతం ఫలితాలు సాధించాయని మంత్రి తెలిపారు. 65 స్కూళ్లు వెనుకబడ్డాయని, అవి వెంటనే ఫలితాలు మెరుగుపరచుకోవాలని హెచ్చరించారు. తెలుగు సబ్జెక్ట్‌లో ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నాయని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని సూచించారు. ఇంటర్మీడియట్‌లో 90.31 శాతం ఉత్తీర్ణత నమోదైందని, 35 విద్యాసంస్థలు 100 శాతం ఫలితాలు సాధించాయని తెలిపారు. 900కు పైగా మార్కులు సాధించిన 4183 మంది విద్యార్థులు, 980కు పైగా మార్కులు సాధించిన 496 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ప్రతి గురుకులంలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ తప్పనిసరి చేయాలని ఆదేశించారు. జిల్లాల్లో పాఠశాలలను సందర్శించనున్నట్లు తెలిపారు. పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (PTM) తప్పనిసరి చేయాలని సూచించారు. సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, ఎంజేపీ సెక్రటరీ సైదులు, ఆర్సీవోలు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
Read Also : స్విట్జర్లాండ్‌లోనే హనీమూన్ షూట్ చేయాలా..? నిర్మాతలను కడిగిపారేసిన కమల్ హసన్..!


