Panic Button | పబ్లిక్‌ వాహనాల్లో పానిక్‌ బటన్‌, ట్రాకింగ్‌ డివైజ్‌ తప్పనిసరి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!

ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణికుల భద్రతను పెంచేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్యాక్సీలు, బస్సులు వంటి వాహనాల్లో పానిక్‌ బటన్‌ (Panic Button) మరియు వాహన ట్రాకింగ్‌ డివైస్‌ (Vehicle Tracking Device) తప్పనిసరి చేయాలని సూచించింది. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతే ప్రధాన లక్ష్యమని కోర్టు స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ వ్యవస్థలు వెంటనే సహాయం అందించడంలో కీలకంగా పనిచేస్తాయని పేర్కొంది.

Supreme Court_Panic Button
Supreme Court_Panic Button

Panic Button | పబ్లిక్‌ వాహనాల్లో ప్రయాణించేవారిని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్యాక్సీలు, బస్సులు సహా ప్రజా రవాణా వాహనాల్లో పానిక్‌ బటన్‌, వెహికల్‌ లోకేషన్‌ ట్రాకింగ్‌ డివైస్‌ తప్పనిసరి చేసింది. రెండు డివైజ్‌స్‌ ఏర్పాటు చేయకపోతే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు ఇవ్వొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రత దృష్ట్యా ఈ చర్యలు అవసరమని ధర్మాసనం తేల్చి చెప్పింది.

Read Also : చిన్నారికి ల‌క్ మాములుగా లేదు .. డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన పెను ప్రమాదం .. తల్లిదండ్రులకు సీపీ సజ్జనార్ హెచ్చరిక

పానిక్‌ బటన్‌ అంటే..?

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం అందించే భద్రతా వ్యవస్థనే పానిక్‌ బటన్‌గా పిలుస్తారు. ప్రయాణ సమయంలో ప్రమాదం అనిపించినా, ప్రమాదం జరిగినా, ఆరోగ్య సమస్య తలెత్తినా ఈ బటన్‌ను నొక్కితే సంబంధిత కంట్రోల్‌ రూమ్‌, పోలీసులు, అత్యవసర సేవలకు వెంటనే సమాచారం చేరుతుంది. అదే సమయంలో వాహనం ఉన్న ప్రదేశం జీపీఎస్‌ ద్వారా ట్రాక్‌ అవుతుంది. ఈ బటన్‌ను సాధారణంగా ప్రయాణికులు సులభంగా ఉండేలా సీట్ల పక్కనే, డోర్‌, వాహనం మధ్య భాగంలో అమర్చుతారు. ఎక్కువగా ఎరుపు రంగులో చిన్న బటన్‌గా ఉండే ఇది అత్యవసర సమయంలో వెంటనే గుర్తించేలా ఏర్పాట్లు చేయనున్నారు.

Read Also : Fiscal Shock 2026: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం… చివరికి భారాన్ని ఎవరు భరిస్తారు?

ఎలా పని చేస్తుంది?

ప్రయాణ సమయంలో అనుమానాస్పద వ్యక్తులు వెంటపడినా, డ్రైవర్‌ అసభ్యంగా ప్రవర్తించినా, బలవంతంగా వాహనంలోకి ఎవరైనా ప్రవేశించేందుకు ప్రయత్నించినా ప్రయాణికులు ఈ బటన్‌ను నొక్కి సహాయం కోరే అవకాశం ఉంటుంది. మహిళలకు ఇది మరింత భద్రత కలిగించే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు, ఫోన్‌ నెట్‌వర్క్‌ అందుబాటులో లేకపోయినా ఈ వ్యవస్థ ద్వారా సమాచారం వెంటనే చేరుతుంది. డ్రైవర్‌, ప్రయాణికుడికి అకస్మాత్తుగా ఆరోగ్య సమస్య తలెత్తినా అంబులెన్స్‌ సేవలు త్వరగా చేరుకునేలా ఉపయోగకరంగా ఉంటుంది. వాహనంలో అమర్చే వెహికల్‌ లోకేషన్‌ ట్రాకింగ్‌ డివైస్‌ వాహనం కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇది నేరుగా కంట్రోల్‌ రూమ్‌, అత్యవసర సేవల నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉంటుంది. ప్రయాణికుడు పానిక్‌ బటన్‌ నొక్కగానే వాహనం ఉన్న ఖచ్చితమైన ప్రదేశం సంబంధిత అధికారులకు చేరుతుంది. దీంతో పోలీసులు, అంబులెన్స్‌, భద్రతా సిబ్బంది వేగంగా స్పందించే అవకాశాలుంటాయి.

Read Also : శబరిమల కేసు: “మహిళలను అంటరానివారిగా చూడలేం”.. సుప్రీంకోర్టులో జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్యలు!

భద్రత పెరుగుతుందా?

ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ప్రజా రవాణా మరింత సురక్షితంగా మారుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులకు ఇది భరోసా కలిగించే అవకాశం ఉందని చెబుతున్నారు. నేరాలు, వేధింపులు తగ్గడంలోనూ, ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం తగ్గించడంలోనూ ఈ సాంకేతిక వ్యవస్థలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

Read Also : ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రం..! కాన్వాయ్‌లో వాహనాల తగ్గింపు..!

 

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »