Rashmi Thakur | కేన్స్‌లో భారతీయ చేనేతకు ప్రత్యేక గుర్తింపు లభించింది. తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన మిస్ ఇండియా స్టార్ యూనివర్స్ 2018 రష్మీ ఠాకూర్ ప్రపంచ ప్రఖ్యాత రెడ్ కార్పెట్‌పై తన అరంగేట్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ మాస్టర్ నేతన్నలు చేతితో నేసిన సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన పోచంపల్లి ఇకత్ కూచర్ దుస్తులను ఆమె ఈ వేదికపై ప్రదర్శించారు. ‘పోచంపల్లి టు కేన్స్’ అనే థీమ్‌తో రూపొందిన ఈ దుస్తులు, తెలంగాణ మగ్గాల నుంచి అంతర్జాతీయ ఫ్యాషన్ వేదిక వరకు జీఐ-ట్యాగ్ చేనేతను తీసుకెళ్లాయి. ఈ ప్రత్యేక దుస్తులకు హైదరాబాదీ ముత్యాలు మరింత అందాన్ని తెచ్చాయి.
నిజాం కాలం నాటి వారసత్వ ఆభరణాలుగా పేరొందిన ఈ ముత్యాలను ఇక్కత్ చేనేతలోని డిజైన్‌కు అనుగుణంగా అమర్చి భారత వస్త్ర సంపద, రాజస ఆభరణాల కలయికను ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా కేన్స్ వేదికపై రష్మీ ఠాకూర్ మాట్లాడుతూ తన అరంగేట్రం వ్యక్తిగతం కాదని, తెలంగాణ నేతన్నల చరిత్రకు చెందినదని పేర్కొన్నారు. 200 ఏళ్ల వారసత్వాన్ని తమ చేతివృత్తిలో నిలిపిన పోచంపల్లి నేతన్నలకు ఈ క్షణాన్ని అంకితం చేస్తున్నానని ఆమె తెలిపారు. ఇక రష్మీ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2014లో మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ గెలుచుకున్న ఆమె, మిస్ క్వీన్ ఇండియా పోటీల్లో మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ పర్ఫెక్ట్ వంటి సబ్ టైటిళ్లను సాధించారు.
Read Also : దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జూన్ ఒకటి నుంచి స్పెషల్‌గా పెన్షన్లు..!
2016లో టర్కీలో జరిగిన మిస్ ప్లానెట్ ఇండియా టైటిల్, 2017లో మలేషియాలో జరిగిన మిస్ ఆసియా పసిఫిక్ పోటీల్లో పాల్గొనడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 2018లో అమెరికాలో జరిగిన మిస్ ఇండియా స్టార్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు. అంతేకాకుండా ఆమె ప్రస్తుతం తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా, కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హ్యాండ్లూమ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా, సైకియాట్రిస్ట్ సొసైటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా, యాంటీ సూసైడ్ కమిటీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. వరల్డ్ ఉమెన్ ఫెడరేషన్ అధ్యక్షురాలిగా, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సంస్థ సభ్యురాలిగా, హ్యాండ్లూమ్ వీవర్స్ రైట్స్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కేన్స్‌లో రెడ్‌కార్పెట్‌పై నడించి తెలంగాణ చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలు ప్రపంచ ఫ్యాషన్ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని పరిశీలకులు పేర్కొంటున్నారు.
Read Also : బండి భగీరథ్ పోక్సో కేసు.. సంచలన లేఖ విడుదల చేసిన బాధితురాలి తల్లి..!


