దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. జూన్‌ ఒకటి నుంచి స్పెషల్‌గా పెన్షన్లు..!

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Govt) కొత్త పింఛన్లు (Pension Scheme) మంజూరు చేసింది. తొలి దశలో 965 మందికి నెలకు రూ.10వేల చొప్పున పింఛను అందించనుంది. సదరం సర్టిఫికెట్ (Sadaram Certificate) ఆధారంగా అర్హులకు తక్షణమే పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Special Pension, Andhra Pradesh
Special Pension, Andhra Pradesh

Special Pension | దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు కొత్తగా ప్రత్యేక పింఛన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి దశలో 965 మందికి జూన్ 1 నుంచి నెలకు రూ.10 వేల చొప్పున పింఛను అందించనున్నారు. ఈ మొత్తాన్ని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇంటివద్దే అందజేయనున్నారు. గతేడాది మార్చి తర్వాత కిడ్నీ, లివర్, గుండె సంబంధిత వ్యాధులతో పాటు బోదకాలు, కుష్టు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం వచ్చిన 965 దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలించి అన్నింటికీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కొత్త పింఛన్ల కోసం నెలకు సుమారు రూ.93.34 లక్షల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read Also : భ‌విష్య‌త్‌లో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు..!

వైద్యారోగ్యశాఖ అనుమతిచ్చిన వెంటనే..

ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఇకపై దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి దరఖాస్తులను వేగంగా పరిశీలించి, వైద్య ఆరోగ్య శాఖ అనుమతి లభించిన వెంటనే అదే నెలలో పింఛను మంజూరు చేయనున్నారు. ఆలస్యం లేకుండా సహాయం అందించడమే లక్ష్యమని అధికారులు పేర్కొంటున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇటీవల పక్షవాతం కారణంగా పూర్తిగా మంచానికే పరిమితమైన వారు, అలాగే కండరాల బలహీనత, తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, తీవ్రమైన హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని దివ్యాంగుల చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో 2025 మార్చి తర్వాత ఏపీలో ఈ కేటగిరీకి చెందిన 1,217 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి పింఛను పొందాలంటే సదరం సర్టిఫికెట్ తప్పనిసరి చేశారు. సర్టిఫికెట్ జారీ అయిన వెంటనే తర్వాతి నెల నుంచి పింఛను మంజూరవుతుంది.

Read Also : టీచర్‌ ప్రమోషన్లకు టెట్‌ తప్పనిసరి.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

పింఛన్‌ మొత్తంలో తేడాలు..

ఈ విభాగంలో పింఛన్ల మొత్తంలో తేడాలున్నాయి. తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హీమోఫీలియా బాధితులకు నెలకు ప్రభుత్వం రూ.10వేల పింఛను అందించనుంది. అయితే, పక్షవాతంతో పూర్తిగా మంచానికే పరిమితమైన, తీవ్రమైన కండరాల వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు రూ.15వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. మరోవైపు అర్హులైన ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం జూన్ నెల నుంచే కొత్త పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు అధికారులు వివరించారు. ప్రభుత్వం ఆదేశాలతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : YS Jagan | ఆక్వా ఫీడ్ ధరల పెంపు ర‌గ‌డ‌.. ఏపీలో వైసీపీ-టీడీపీ ప్ర‌భుత్వం మ‌ధ్య మాట‌ల యుద్ధం..!

 

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »