తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గులాబీ శ్రేణులే లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
రాజకీయంగా తనకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా (పాలమూరు) ప్రాణమైతే, ఖమ్మం జిల్లా గుండెకాయ లాంటిదని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. గత 2023 జూలైలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో ఖమ్మం ప్రజలు ఉప్పెనలా తరలివచ్చి బీఆర్ఎస్‌ను బొంద పెట్టారని గుర్తు చేశారు.
ఇప్పుడు మళ్లీ అదే జూలై మాసంలో బీఆర్ఎస్‌ను రాష్ట్రంలో మొలకెత్తనివ్వకుండా చేసేందుకు వేలాదిగా తరలివచ్చిన జనసందోహానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2023లో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారని చెప్పారు.
ఆ తీర్పుతోనే ‘పాపాల భైరవుడు’ ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జరగబోయే రాజకీయ కురుక్షేత్రంలో కల్వకుంట్ల కుటుంబాన్ని పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ సైనికులు విశ్రమించరని స్పష్టం చేశారు.
రాబోయే సాధారణ ఎన్నికల కాలపరిమితిపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికలు 2028 డిసెంబరులో జరగవని, అవి నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2029 మే లేదా జూన్ మాసంలో జరుగుతాయని జోస్యం చెప్పారు. ఆ సమయానికి తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు పెరుగుతాయని వివరించారు.
36 నెలల ముందే ఎన్నికల జోస్యం
ఎన్నికలకు ఇంకా 36 నెలల సమయం ఉందనగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పెరగబోయే 182 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే 117 సీట్లు గెలుచుకుని రెండోసారి పీఠాన్ని అధిరోహిస్తుందని భద్రాచలం రాముడిపై ఆన వేసి చెప్పారు.
కేసీఆర్ నమ్ముకున్న దొంగ సర్వే సంస్థలు ఈ నిజాన్ని రాసి పెట్టుకోవాలని సవాల్ విసిరారు. ఈ విజయం కోసం కాంగ్రెస్ శ్రేణులు రోజుకు 18 గంటల పాటు శ్రమిస్తాయని ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం అంతర్గత కలహాలు తీవ్రమయ్యాయని, ఒకే ఇంట్లో రెండు గుంపులుగా విడిపోయారని ఎద్దేవా చేశారు. ఒకరిపై ఒకరికి నమ్మకం లేని పరిస్థితి ఆ పార్టీలో ఉందన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య పోటీని ఉద్దేశిస్తూ.. ఒకరు కన్నెపల్లికి వెళ్లి పంపులు ఆన్ చేయాలని డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వల్ల ఇప్పటికే రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ తన దుష్ట రాజకీయాల కోసం మళ్లీ మేడిగడ్డలో నీళ్లు నింపాలని చూస్తున్నారని, అలా చేస్తే భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంతో పాటు పరిసర ప్రాంతాలు మునిగిపోతాయని హెచ్చరించారు. గతంలో వరదల వల్ల ఖమ్మం జిల్లాలో 44 గ్రామాలు కొట్టుకుపోయిన దుస్థితిని గుర్తు చేస్తూ, కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ సర్వేలపై రేవంత్ ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని, సర్వేల్లో ఓడిపోతుందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి తిప్పికొట్టారు. దేశంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియకుండా, నియోజకవర్గాల రిజర్వేషన్లు ఎలా మారుతాయో క్లారిటీ లేకుండా సర్వేలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్ లాంటి చోట్ల ఇలాగే దొంగ సర్వేలు చెబితే జనం బీఆర్ఎస్‌ను బండకేసి కొట్టారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలంతా ఒక ‘బ్యాడుమేళం బ్యాచ్’లా తయారయ్యారని విమర్శించారు.
ఇదే క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సవాల్ విసిరారు. తాను భవిష్యత్తులో బీజేపీలోకి వెళ్లనని హరీష్ రావు తన మామ కేసీఆర్ పై ఒట్టేసి చెప్పగలరా అని నిలదీశారు.
గులాబీ పార్టీని త్వరలోనే బీజేపీలో విలీనం చేస్తారని కేసీఆర్ సొంత చెల్లెలే చెబుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రా కాంట్రాక్టర్లు బీఆర్ఎస్ పార్టీకి వందల కోట్లు ఇచ్చారనే నిజాన్ని కూడా కేసీఆర్ సోదరి బహిర్గతం చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎటు పోతుందో, హరీష్ రావు ఎటు వెళ్తారో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు.
తాము అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన షాదీ ముబారక్, రైతుబంధు వంటి పథకాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేశామని వివరించారు.
రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని రూ. 12 వేలకు పెంచడమే కాకుండా, ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేసి రైతులను రుణవిముక్తులను చేశామని గర్వంగా ప్రకటించారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో పెరగబోయే 26 పార్లమెంట్ స్థానాలకు గాను కనీసం 20 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ కూటమిని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవడమే మన లక్ష్యం కావాలన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరిక మేరకు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి కొత్త ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు చేస్తున్నట్లు సభాముఖంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ‘ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్’ (మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం) నినాదంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
తరచుగా అడిగే ప్రశ్నలు
Q1. వచ్చే సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు?
తెలంగాణలో వచ్చే సాధారణ అసెంబ్లీ ఎన్నికలు 2028 డిసెంబరులో జరగవని, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2029 మే లేదా జూన్ మాసంలో జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Q2. పునర్విభజన తర్వాత తెలంగాణలో సీట్ల సంఖ్య ఎంతకు పెరుగుతుందని సీఎం చెప్పారు?
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తెలంగాణలో లోక్‌సభ స్థానాల సంఖ్య 17 నుండి 26కు, అలాగే అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుండి 182కు పెరుగుతుందని ముఖ్యమంత్రి వివరించారు.
Q3. మధిర నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విద్యాసంస్థను మంజూరు చేశారు?
తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి మేరకు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.


