Minister Jupalli | పర్యాటక రంగం కేవలం విహార యాత్రలకే పరిమితం కాదు.. అది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, యువతకు ఉపాధికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌కు శక్తివంతమైన సాధనమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. డిజిటల్ వేదికల ద్వారా తెలంగాణ ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, సంస్కృతి సంపదను ప్రపంచానికి చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 99 రోజుల కార్యాచరణను వేగవంతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక రంగానికి కొత్త ఊపునివ్వడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. పర్యాటక వారోత్సవాల సందర్భంగా బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన ‘తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశం’లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్లు ఇచ్చిన సలహాలు, సూచనలను స్వీకరించి పర్యాటక రంగాన్ని మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. అదే సమయంలో పర్యాటక ప్రమోషన్‌తో పాటు యువతలో సామాజిక స్పృహ కలిగించే దిశగా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.
Read Also : స్విట్జర్లాండ్‌లోనే హనీమూన్ షూట్ చేయాలా..? నిర్మాతలను కడిగిపారేసిన కమల్ హసన్..!
పర్యాటకంతో ఉపాధి.. రాష్ట్రానికి ఆదాయం
పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయాన్ని వైద్య, ఆరోగ్య, విద్యా రంగాల బలోపేతానికి, అలాగే పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పారు. ‘మన ప్రాంతాలను మనమే చూడకపోతే జీవితం సంపూర్ణం కాదు’ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఆర్థిక స్థోమత అడ్డంకి కాదన్నారు. అనవసర ఖర్చులను తగ్గించుకుని కుటుంబంతో కలిసి పర్యాటక ప్రాంతాల్లో గడపడం ద్వారా మానసిక ప్రశాంతత, ఆనందం లభిస్తాయని సూచించారు. దేశ, విదేశీ పర్యాటకులతో పాటు స్వరాష్ట్ర ప్రజలు కూడా తెలంగాణ పర్యాటక ప్రాంతాలను విస్తృతంగా సందర్శించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత, కనీస వసతులు, ఆధునిక టెంట్ వసతి సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టామని చెప్పారు. వినియోగంలో లేని హరిత మోటళ్లు, పర్యాటక భూములను ఆదాయ వనరులుగా మార్చే దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కేవలం పర్యాటక ప్రమోషన్‌కే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని మంత్రి జూపల్లి సూచించారు. యువత గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు, బెట్టింగ్, ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై సామాజిక, మానసిక చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.
Read Also : కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌పై అదనంగా రూ.3 అదనంగా సుంకం..!
త్వరలో ‘ప్రభాత భేరి’
ప్రభుత్వం ‘ప్రభాత భేరి’ అనే కొత్త సామాజిక చైతన్య కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. లఘు చిత్రాలు, నాటికలు, రంగస్థల ప్రదర్శనలు, వివిధ కళారూపాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వం, ఆతిథ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో క్రియేటర్లు భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగస్వాములయ్యే కంటెంట్ క్రియేటర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. తెలంగాణను ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉత్తమ ప్రతిభ కనబరిచే టూరిజం క్రియేటర్లకు ప్రభుత్వం తరఫున అవార్డులు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తామని మంత్రి జూపల్లి ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ నూతన మెటా ఖాతా, అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను మంత్రి జూపల్లి ఆవిష్కరించారు. ‘టైమ్‌లెస్ తెలంగాణ’ వీడియోను ప్రదర్శించారు. కార్యక్రమంలో పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్, ఎండీ గౌతమి, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, నిథమ్ డైరెక్టర్ వెంకట రమణ, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి తదితరులు పాల్గొన్నారు.
Read Also : ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకులకు కిసాన్ సమ్మానిధి వస్తుందా..? త్వరలోనే రైతుల ఖాతాల్లోకి 23వ విడత నిధులు..!


