మ‌ద్యం ప్రియుల‌కు షాక్ ఇవ్వ‌బోతున్న స‌ర్కారు.. జూన్ నుంచి ధ‌ర‌ల పెంపు..!

తెలంగాణలో మద్యం ధరల పెంపు (Liquor Price Hike) దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జూన్ తర్వాత కొత్త రేట్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు (Alcohol Sales), ఎక్సైజ్ ఆదాయం (Excise Revenue) పెంపుపై దృష్టి సారించిన‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది.

Liquor Price Hike | మద్యం ప్రియులకు తెలంగాణ ప్ర‌భుత్వం షాక్ ఇవ్వ‌బోఉన్న‌ది. త్వ‌ర‌లోనే మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ధ‌ర‌ల‌ను స‌వ‌రించే అంశంపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ అవతరణ దినోత్సవం అనంత‌రం.. అంటే జూన్ 2 తర్వాత కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. విస్కీ, బ్రాండీ, బీర్ సహా దాదాపు అన్ని బ్రాండ్లపై 10 నుంచి 15 శాతం వరకు ధరలు పెరగొచ్చని తెలుస్తోంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, రవాణా ఛార్జీలు, గ్లాస్ బాటిళ్ల ధరలు, ప్యాకింగ్ మెటీరియల్ ఖర్చులు భారీగా పెరగడం వల్ల డిస్టిలరీలు, బ్రూవరీస్ కంపెనీలు గత కొంతకాలంగా ధ‌ర‌ల‌ను స‌వ‌రించాల‌ని కోరుతున్నాయి.

Read Also : YS Jagan | ఆక్వా ఫీడ్ ధరల పెంపు ర‌గ‌డ‌.. ఏపీలో వైసీపీ-టీడీపీ ప్ర‌భుత్వం మ‌ధ్య మాట‌ల యుద్ధం..!

పశ్చిమాసియాలో ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. దాంతో అంత‌ర్జాతీయంగా ఇంధ‌న ధ‌ర‌లు పెరిగాయి. అలాగే, ఎల్పీజీ, సహజవాయువు సరఫరాపై ప్రభావం ప‌డుతోంద‌ని, ఫ‌లితంగా మ‌ద్యం త‌యారీ ఖ‌ర్చులు విప‌రీతంగా పెంచిన‌ట్లుగా సంబంధిత వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీల ఒత్తిడి, ప్రభుత్వ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ధ‌ర‌ల పెంపు విష‌యంలో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ‌లో గ‌తంలో సైతం ప‌లు ద‌ఫాల్లో మ‌ద్యం ధ‌ర‌లు పెరిగిన విష‌యం తెలిసిందే. 2023 చివర‌లో కొన్ని బీర్ బ్రాండ్ల ధరలను ప్ర‌భుత్వం పెంచింది. 2025లో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత కూడా పలు ప్రీమియం బ్రాండ్ల రేట్లు స‌వ‌రించింది. అప్పట్లో 650 ఎంఎల్ బీర్ బాటిల్ ధర రూ.150 నుంచి రూ.180కి పెరిగింది.

Read : ఏపీలో విస్తరణపై ఉబెర్ దృష్టి.. సీఎం చంద్రబాబుతో గ్లోబల్ సీఈఓ భేటీ..!

మ‌రో వైపు ధరలు పెరిగినా తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుమాత్రం తగ్గడం లేదు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు రికార్డు స్థాయిలో రూ.40,209 కోట్ల ఆదాయం ఖ‌జానాకు చేరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత వ‌చ్చిన అత్య‌ధిక ఆదాయ‌మ‌ని అధికారిక లెక్క‌లు చెబుతున్నాయి. అంత‌కుముందు సంవ‌త్స‌రం అంటే 2024-25లో ఈ ఆదాయం రూ.37,487 కోట్లుగా ఉన్న‌ది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 382 లక్షలకుపైగా మద్యం కేసులు అమ్ముడయ్యాయి. డిసెంబర్ 2025లో ఒక్క నెలలోనే రూ.5వేలకోట్లకు పైగా అమ్మకాలు జరగడం గమనార్హం. నూతన సంవత్సరం వేడుకలు, ఎన్నికల ప్రభావంతో అమ్మకాలు భారీగా పెరిగినట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. ప్ర‌స్తుత వేస‌విలోనూ మ‌ద్యం అమ్మ‌కాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా బీర్లు ఎక్కువ‌గా అమ్ముడ‌వుతున్నాయి. ఇక ప్ర‌భుత్వానికి వ‌చ్చే ఆదాయంలో ఎక్సైజ్‌శాఖ కీల‌కం. ధ‌ర‌ల‌ను పెంచితే ఆదాయం మ‌రింత పెరుగుతుంద‌ని భావిస్తున్నారు.

Read Also : వాత మొదలైంది.. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూ.3 పెంపు..!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »